శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలో బిజెపి బహిరంగసభ జరగనుంది. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు, ఈ బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్ళి అనుమతి తెచ్చుకొని మరీ నిర్వహిస్తున్నారు. కనుక ఈ సభలో జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితర బిజెపి నేతలు సిఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఖాయం.
ఇదే సమయంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్ కూడా మరో ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతు సంఘాల నేతలను ప్రగతి భవన్‌కు ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేస్తున్నారు. అంతకు ముందు వారికి ప్రగతి భవన్‌లో తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి సంబందించిన ఓ డాక్యుమెంటరీని చూపారు.
భోజనాలు చేసిన తర్వాత వారితో సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు సమావేశమవుతారు. వారికి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మరోసారి వివరించి, దేశవ్యాప్తంగా కూడా ఈవిదంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని వివరిస్తారు. తెలంగాణలో తన ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలను వారివారి రాష్ట్రాలలో కూడా అమలుచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, అవసరమైతే ఉద్యమించాలని కేసీఆర్ చెప్పబోతున్నారు.
కానీ మోడీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని, తెలంగాణలో రైతులు లక్షల టన్నుల ధాన్యం పండిస్తే మోడీ ప్రభుత్వం దానిని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిందని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, కార్పొరేట్ కంపెనీలతో అంటకాగుతోందని కేసీఆర్ వారికి వివరించనున్నారు.
రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప దేశంలో రైతుల సమస్యలు తీరవని, కనుక మోడీని గద్దె దింపేందుకే జాతీయరాజకీయాలలో ప్రవేశిస్తున్న తనకు అండగా నిలబడాలని సిఎం కేసీఆర్ రైతులను కోరనున్నారు.
అంటే కేసీఆర్‌ను గద్దె దించేందుకు బిజెపి ప్రయత్నిస్తుంటే, మోడీని గద్దె దించేదుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న మాట!