తెలంగాణకు మంటలా... పంటలా? కేసీఆర్‌ సూటి ప్రశ్న

August 26, 2022


img

సిఎం కేసీఆర్‌ గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. 

హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఇటువంటి మంటలే కావాలో లేదా పచ్చటి పంటలే కావాలో తేల్చుకోవాలని కేసీఆర్‌ ప్రజలకు కోరారు. ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మతరాజకీయాలు చేస్తూ మంటలు రగిలించి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. 

మోడీ ప్రభుత్వం దేశంలో ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసి దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకొందని, ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తుండటం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 

ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మరెంతో కష్టపడి అభివృద్ధి చేసుకొంటే, బిజెపి తెలంగాణ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని, ప్రజలు బిజెపి మాయలో పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు ఏవిదంగా ఉండేదో మళ్ళీ ఆ స్థితికి దిగజారుతుందని, అప్పుడు దానిని బాగుచేసుకోవడం ఎవరివల్లా సాధ్యం కాదని కేసీఆర్‌ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డి బిజెపితో నేను పోరాడుతానని అలాగే ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ ఈ మతపిచ్చి బిజెపి నేతలను తరిమికొట్టి బిజెపి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

ఎనిమిదేళ్ళ క్రితం నేను, మోడీ ఒకేసారి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చేపట్టామని, ఈ 8 ఏళ్ళలో నేను తెలంగాణను ఎంత అభివృద్ధి చేశానో అందరూ చూస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్‌ కోరారు. మోడీ ప్రభుత్వం కనీసం విద్యుత్‌ సమస్య కూడా తీర్చలేకపోయిందని కేసీఆర్‌ ఆరోపించారు. పైగా రాష్ట్రాలను అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనుక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించెందుకే తాను జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్‌ చెప్పారు. 


Related Post