పార్టీలను బలహీనపరిచడమే మా లక్ష్యం: ధర్మపురి అర్వింద్

August 26, 2022


img

బీజేపీ మొదట్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలనుకొనేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉండాలని కోరుకొంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై అధికారం చేపడితే బిజెపిని ఎవరూ వేలెత్తి చూపేవారు కాదు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఇంతకాలం బిజెపి మత రాజకీయాలనే ప్రజలు చూశారు. కానీ ఇప్పుడు దాని రాజకీయ అరాచకత్వం కూడా చూస్తున్నారు. చూసి అసహ్యించుకొంటున్నారు. అయినా బిజెపి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేందుకు సిద్దమవుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఇందుకు సాక్ష్యాలు. 

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొన్న తర్వాత నగరంలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇతర పార్టీలన్నిటినీ బలహీనపరిచి మేము బలపడటమే మా లక్ష్యమని నిసిగ్గుగా చెప్పుకొన్నారు. రాజకీయాలలో ఇది సహజమే అయినా అనైతిక విధానాలతో అధికారం చేజిక్కించుకోవాలనుకోవడమే తప్పు. 

ఇప్పటికే దేశంలో రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. ఇప్పుడు అధికారం కోసం బిజెపి ఇంకా నీచానికి దిగజారితే అప్పుడు దాని నుంచి తమను తాము కాపాడుకొనేందుకు మిగిలిన పార్టీలు, ప్రభుత్వాలు కూడా మరోమెట్టు దిగి నీచరాజకీయాలు చేయకతప్పదు. 

తలుపులు మూసి కొడితే పిల్లైనా తిరగబడుతుంది. ఇప్పుడు కేసీఆర్‌ అదే చేయబోతున్నారు. తన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్న బిజెపిని కేంద్రంలో గద్దె దించేందుకు జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు. ఆయన బిజెపిని ఎదుర్కోగలరా లేదా?మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించగలరా లేదా?అనేది పక్కన పెడితే, ఆయనను అందుకు పురుకొల్పింది బిజెపియే అని చెప్పకతప్పదు. నేడు దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల అధినేతలు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సమాయత్తం అవుతుండటం బిజెపి స్వయంకృతాపరాదమే అని చెప్పకతప్పదు. 


Related Post