మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక నష్టం అనుకొంటే ఆయన రాజీనామాతో ఉపఎన్నిక ఎదుర్కోవలసి వస్తుండటం మరో పెద్ద కష్టం.
టిఆర్ఎస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికే బిజెపి ఆయన చేత రాజీనామా చేయించగా, సిఎం కేసీఆర్ కూడా బిజెపితో తాడోపేడో తేల్చుకోవడానికే ఆయన రాజీనామాను వెంటనే ఆమోదింపజేశారు. కనుక ఈ ఉపఎన్నిక టిఆర్ఎస్, బిజెపిలకు మద్య జరుగబోతున్న కురుక్షేత్ర మహాసంగ్రామం వంటిదని చెప్పవచ్చు.
ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పరువు నిలబెట్టుకోవడానికి బరిలో దిగుతోంది. కానీ గెలవడం దాదాపు అసంభవమని అందరికీ తెలుసు. కనుక కనీసం పార్టీలో అందరూ కలిసి గట్టి ప్రయత్నం చేసి ఓడిపోయినా ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయబోనని, మునుగోడు ఉపఎన్నికలకు దూరంగా ఉంటానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భీష్మించుకొని కూర్చోన్నారు.
ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళి ప్రియాంకా వాద్రాతో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి గురించి సుదీర్గంగా మాట్లాడానని చెప్పారు. కానీ మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని మాత్రం చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఈ ఉపఎన్నికకు ఆయన దూరంగా ఉంటే బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరోక్షంగా సహకరించినట్లే అవుతుంది. కనుక ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు ఆయన కృషి చేస్తారా లేదా?త్వరలో తేలిపోతుంది.