కేజ్రీవాల్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనా?

August 25, 2022


img

ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేకపోతే, అధికార పార్టీలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టో, భయపెట్టో లొంగదీసుకొని ప్రభుత్వాలను పడగొట్టే దూరలవాటు బిజెపికి ఇప్పుడు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రెండు నెలల క్రితమే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్ప సాయంతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి దొడ్డిదోవలో బిజెపి అధికారం చేజిక్కించుకొంది. 

ఇప్పుడు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై కన్నేసింది. ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా వేరు చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బుదవారం ఉదయం 11 గంటలకు తమ 62 మంది ఎమ్మెల్యేలతో అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. దానికి 12 మంది ఆమాద్మీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు! మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసే ముందు సరిగ్గా ఇలాగే జరిగింది. కనుక కేజ్రీవల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బిజెపి పావులు కదుపుతోందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు సిఎం సమావేశానికి  డుమ్మాకొట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వంలో కలకలం మొదలైంది. 

“మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రభుత్వం వంతే,” అని బిజెపి సీనియర్ నేత, ఎంపీ కెలక్ష్మణ్ బహిరంగంగానే చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి చాలా దూకుడుగా ఉంది. కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది.


Related Post