బిజెపి సంచలన నిర్ణయం: రాజా సింగ్‌పై సస్పెన్షన్ వేటు!

August 23, 2022


img

బిజెపి సంచలన నిర్ణయం తీసుకొంది. ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ముస్లింల మనోభావాలు దెబ్బ తినేవిదంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో బిజెపి వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బిజెపిఎల్పీ పదవి నుంచి కూడా ఆయనను తొలగించింది. పార్టీకి నష్టం కలిగించే విదంగా వ్యవహరించినందుకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజా సింగ్‌కు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. కనుక పార్టీ నుంచి బహిష్కరించడం కూడా ఖాయమేనని భావించవచ్చు. 

ఢిల్లీ మద్యం కుంభకోణంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి రాష్ట్రంలో టిఆర్ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించేందుకు బిజెపి ప్రయత్నిస్తుండగా రాజా సింగ్‌ వీడియోతో బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బిజెపి మహిళా నేత నుపూర్ శర్మ అల్లా గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలు భారత్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పుకొని శాంతింపజేయవలసి వచ్చింది. 

ఆ సమస్య సర్దుమనిగిందనుకొంటుంటే ఎమ్మెల్యే రాజా సింగ్‌ మళ్ళీ కొత్త సమస్యను తెచ్చిపెట్టడంతో బిజెపి అధిష్టానం వెంటనే ఆయనపై చర్యలు తీసుకొంది. అయితే రాజా సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, బిజెపిని గట్టిగా నిలదీయడానికి టిఆర్ఎస్‌, మజ్లీస్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు మంచి అవకాశం లభించినట్లయింది.


Related Post