బిజేపీ ఉచ్చులో తెరాస చిక్కుకొందా?

August 23, 2022


img

కేంద్ర హోం మంత్రి అమిత్‌ అమిత్‌ షా మునుగోడు బహిరంగసభలో హెచ్చరించినట్లే బిజెపి చేస్తున్న రాజకీయాలతో కేసీఆర్‌ ప్రభుత్వానికి ఊపిరి సలపడంలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు ఆరోపించడం, వాటిని ఆమె ఖండించడం జరిగింది. 

ఇదే అంశంపై నిరసనలు తెలియజేస్తూ బిజెపి కార్యకర్తలు నిన్న కల్వకుంట్ల కవిత ఇంటిని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చి, జనగామలో నిరసన దీక్ష చేసేందుకు సిద్దపడ్డారు. 

సరిగ్గా ఇదే సమయంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు రాజా సింగ్‌ను, మరోపక్క జనగామలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. జనగామలో టిఆర్ఎస్‌ కార్యకర్తలు బిజెపి ఫ్లెక్సీ బ్యానర్లను చించివేయడంతో టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరుగుతున్నాయి. 

బండి సంజయ్‌, రాజా సింగ్‌లను అరెస్ట్ చేసినట్లు తెలియడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి వారితో మాట్లాడారు. తన ప్రజా సంగ్రామయాత్రను టిఆర్ఎస్‌ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకొని దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, కనుక కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని బండి సంజయ్‌ కోరినట్లు తెలుస్తోంది. 

గత 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో రాష్ట్ర బిజెపి నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బిజెపి నేతలు పదేపదే తమ అల్లాను, ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బిజెపి ఈవిదంగా ప్రజల మద్య చిచ్చుపెడుతోందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. 

రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి ఎటువంటి రాజకీయ వాతావరణం కోరుకొంటోందో నేడు అదే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులను బిజెపి సృష్టించిందా లేదా ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో బిజెపిని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నంలో టిఆర్ఎస్‌ దాని  ఉచ్చులో చిక్కుకొని చేజేతులా ఈ పరిస్థితులను కొనితెచ్చుకొందా?అనే సందేహం కలుగుతుంది. తెలంగాణలో అనూహ్యంగా జరుగుతున్న ఈ పరిణామాలు దేనికి దారి తీస్తాయో? చూడాలి.


Related Post