2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఏ ఎన్నికలలోనూ గెలవలేకపోతోంది ఒకవేళ గెలిచి అధికారంలోకి వచ్చినా చేజార్చుకొంటోంది. కేంద్ర ప్రభుత్వం విధానాలను, ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ఎంతగా ఎండగడుతున్నప్పటికీ బిజెపి నానాటికీ బలపడుతూనే ఉంది. మొదట్లో బిజెపి ప్రజాస్వామ్యబద్దంగానే నడుచుకొన్నప్పటికీ ఇప్పుడు అధికారం చేజిక్కించుకోవడం కోసం దేనికైనా తెగిస్తోంది.
ఈ పరిణామాలన్నిటినీ చూస్తున్న రాహుల్ గాంధీ ఇక బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలను ఎదుర్కోవడం కష్టమని గ్రహించినట్లే ఉన్నారు. ఒకవేళ పార్టీ పగ్గాలు చేపడితే మళ్ళీ మరోసారి కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి తలదించుకోవలసి వస్తుంది. బహుశః అందుకే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించడం లేదనుకోవచ్చు.
రాహుల్ గాంధీ దేశంలో దిగజారిపోతున్న రాజకీయ పరిస్థితులు, బిజెపి, మోడీ, అమిత్ షాల తీరును బాగానే అర్దం చేసుకొన్నారు కానీ యూపీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి గట్టి ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ప్రియాంకా గాంధీకి ఇంకా తత్వం బోధపడినట్లు లేదు. అందుకే తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టి మరోసారి చేయి కాల్చుకోబోతున్నారు.
సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌నేతలతో భేటీ అయ్యి మునుగోడు ఉపఎన్నికలపై చర్చించారు. అభ్యర్ధి, ఎన్నికల వ్యూహం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. బహుశః మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి కూడా ఆమె వచ్చినా ఆశ్చర్యం లేదు.
అయితే మునుగోడు ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిల మద్యనే సాగబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. ఉపఎన్నికలు వస్తున్నా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఆగలేదు. కనుక కాంగ్రెస్ ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది. కళ్ళ ముందు ఓటమి చాలా స్పష్టంగా కనబడుతుంటే ప్రియాంకా గాంధీ దీనిలో వేలు పెడితే మరోసారి ఎదురుదెబ్బ, అవమానం తప్పకపోవచ్చు. కనుక ఈ ఉపఎన్నికపై దృష్టి పెట్టడం కంటే ప్రస్తుతం నెలకొన్న క్లిష్టపరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ఏవిదంగా పటిష్టం చేసుకోవాలని ప్రియాంకా గాంధీ ఆలోచిస్తే మంచిదేమో?