మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్ ఊహించిందే కానీ ఆయన పదవికి కూడా రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీకి రెండు షాకులు తగిలాయి. 1. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడిగా ఉన్న ఆయనను కోల్పోవడం, 2. ఉపఎన్నికను ఎదుర్కోవలసి రావడం.
ఆయనను కోల్పోతే ఏదోవిదంగా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు కానీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ సమస్యలతో, పార్టీలో కీచులాటలతో సతమతమవుతున్న వేళ ఉపఎన్నికలను ఎదుర్కోవలసి రావడం కాంగ్రెస్‌కు చాలా కష్టమే. కానీ తప్పదు.
కనుక మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి, అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులను ఢిల్లీకి ఆహ్వానించింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు ఢిల్లీ చేరుకొని సోమవారం సాయంత్రం జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్నారు.
కానీ ఈరోజు ఉదయం వరకు ఢిల్లీలోనే ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు. తద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాన్ని సైతం ధిక్కరించినట్లయింది. కనుక ఈరోజు సమావేశంలో మునుగోడు ఉపఎన్నికలతో బాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి క్లిష్ట సమయంలో వెంకట్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ధిక్కారస్వరం వినిపిస్తూ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ను ముప్పతిప్పలు పెడుతున్నారు.
కనుక రేవంత్ రెడ్డి తదితరులు ఆయన తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక కాంగ్రెస్ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసి పార్టీ నుంచి బహిష్కరించినా ఆశ్చర్యం లేదు. ఆయన కూడా బిజెపిలో చేరబోతున్నారని బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కనుక కాంగ్రెస్ అధిష్టానందే ఆలస్యం.