కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న మునుగోడు సభలో ప్రసంగిస్తూ సిఎం కేసీఆర్, కుటుంబపాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాలలో ఇటువంటి విమర్శలు, ఆరోపణలు సహజమే. సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు కనుక అమిత్ షాను కూడా తప్పుపట్టలేము.
కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొంటూ, “ఇది ఒక నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో సహా పీకేసేందుకు తొలి ప్రయత్నం ఇది,” అని అన్నారు.
కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం నియమించలేదు. తెలంగాణ ప్రజలు ఎన్నుకొంటే అధికారంలో ఉంది. అటువంటి ప్రజా ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించేస్తానని కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న అమిత్ షా హెచ్చరించడం సరికాదు.
ఒకవేళ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలనుకొంటే ఎన్నికలలో పోటీ చేసి, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా అధికారంలోకి రావచ్చు. కానీ కట్టప్పల సాయంతో కేసీఆర్ ప్రజాప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరించడం, ప్రజాప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో సహా పెకలిస్తామని ఈవిదంగా బెదిరిస్తుండటం సరికాదు. తద్వారా ఎన్నికలలో పోటీ చేసి గెలవలేకపోతే అడ్డుదారిలోనైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెరిస్తున్నట్లే ఉంది. ప్రజలెన్నుకొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు ఈవిదంగా బెదిరిస్తుంటే తెలంగాణ ప్రజల అహం, మనోభావాలు దెబ్బతింటాయి. అప్పుడు నష్టపోయేది బిజెపియే అని గ్రహిస్తే మంచిది.