ఆదివారం మునుగోడులో బిజెపి అధ్వర్యంలో జరుగబోతున్న భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరి కొద్దిసేపటిలో హైదరాబాద్ చేరుకొనున్నారు. బిజెపి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనడం పెద్ద విశేషం కాదు. అయితే చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూ.ఎన్టీఆర్‌తో ఈరోజు సాయంత్రం అమిత్ షా భేటీ అవుతుండటమే చాలా విశేషం. మునుగోడులో బహిరంగసభ ముగించుకొన్న తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే ముందు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోగల నోవాటెల్ హోటల్‌లో జూ.ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కాబోతున్నారని బిజెపి నేతలు దృవీకరించారు. దీనిలో వారు రాజకీయాలు చర్చించరని, ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన అమిత్ షా దానిలో జూ.ఎన్టీఆర్ నటనకు చాలా ముగ్దులయ్యారని, కనుక జూ.ఎన్టీఆర్‌ను అభినందించేందుకే నోవాటెల్ హోటల్‌కు ఆహ్వానించారని వారిరువురూ సుమారు 15 నిమిషాలు మాత్రమే భేటీ అయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు.
ఒకవేళ బిజెపి నేతలు చెపుతున్నట్లు ఆర్ఆర్ఆర్ సినిమా అంతగా నచ్చి ఉంటే దానిలో జూ.ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా చేశారు కనుక రామ్ చరణ్‌ను కూడా ఆహ్వానించి అభినందించవచ్చు. కానీ జూ.ఎన్టీఆర్‌ను మాత్రమే అభినందిస్తారంటే నమ్మశక్యంగా లేదు. ఏపీలో మళ్ళీ టిడిపితో పొత్తులు పెట్టుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక జూ.ఎన్టీఆర్‌ను కూడా మళ్ళీ రాజకీయాలలోకి రావాలని ఆహ్వానించబోతున్నారేమో? లేదా జూ.ఎన్టీఆర్‌ను బిజెపిలో చేరాల్సిందిగా ఆహ్వానించబోతున్నారేమో?ఒకవేళ జూ.ఎన్టీఆర్ అందుకు అంగీకరిస్తే తెలంగాణలో కూడా ఆయన సేవలను ఉపయోగించుకోవచ్చునని బిజెపి భావిస్తోందేమో? తెలీదు. కానీ వారి భేటీకి చాలా ప్రాధాన్యం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.