మునుగోడు ఉపఎన్నికలు అక్కడి ఓటర్లకు ఓ అగ్నిపరీక్ష వంటివని చెప్పవచ్చు. ఎందుకంటే మూడు ప్రధానపార్టీలు మూడు పూర్తిభిన్నమైన వాదనలు వినిపిస్తుండటంతో చాలా గందరగోళం నెలకొంది.
ముందుగా టిఆర్ఎస్ గురించి ఆలోచిస్తే, తమకు ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెపుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతోంది కనుక ఈ ఉపఎన్నికలలో బిజెపిని ఓడించి గట్టిగా బుద్ది చెప్పాలని టిఆర్ఎస్ మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.
ఒకవేళ టిఆర్ఎస్‌ను ప్రజలు గెలిపించకపోతే ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోదా?అంటే పట్టించుకోదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెపుతున్నారు. రాష్ట్రాభివృద్ధే తమ ధ్యేయం అని చెపుతున్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడును ఎందుకు పట్టించుకోలేదు?
బిజెపి వస్తే మోటర్లకు మీటర్లు పెడుతుంది, రాష్ట్రంలో మళ్ళీ పరాయి పాలన వస్తుందంటూ సిఎం కేసీఆర్ ప్రజలను భయపెడుతున్నారు. కానీ ఈ ఉపఎన్నికలతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని అందరికీ తెలుసు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో బిజెపియే గెలిచింది. కానీ ఏమీ జరుగలేదు కదా?అయినా ఓ ఉపఎన్నికలో బిజెపి గెలిస్తే ఫరక్ పడదని టిఆర్ఎస్సే స్వయంగా చెపుతున్నప్పుడు, మరి కేంద్రాని బూచిగా ఎందుకు చూపిస్తోంది?
ఇక బిజెపి విషయానికి వస్తే, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్‌ను కాదని బిజెపిని గెలిపిస్తే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తమ నియోజకవర్గాలకు ఏమి చేశారంటే ఏమీ లేదని అందరికీ తెలుసు. మోడీని చూసి ఓటేయమని అడుగుతున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలిపిస్తే ఏమి చేయలేకపోయినపప్పుడు మోడీని చూసి బిజెపికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి?మునుగోడుకి ఏమీ చేయలేకపోయానని చెపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి?
ప్రజలకు ఏమీ చేయకపోయినా తన రాజకీయ ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేసి ప్రజల నెత్తిపై బలవంతంగా ఉపఎన్నికలు రుద్దినందుకా? లేక ఈ ఉపఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవాలనుకొంటునందుకా? తన నిర్ణయంతో ప్రజాధనం వృదా చేస్తున్నందుకా?
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మరిప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా మళ్ళీ అదే పరిస్థితి కదా? మరెందుకు ఓట్లు వేయాలి?వేసినా ఏం ప్రయోజనం?
అయితే ఈ మూడు పార్టీలలోనే ఎవరో ఒక అభ్యర్ధిని ప్రజలు ఎన్నుకోవలసి ఉంటుంది కనుక ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొన్నట్లయితే మునుగోడు నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఏడాదిలోగా మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టేయొచ్చు. కనీసం ఆ భయంతోనైనా అభివృద్ధి చేయవచ్చు.