మునుగోడు ఉపఎన్నికల పోరుకు సిద్దమవుతున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దశాబ్ధాలుగా నల్గొండ జిల్లావాసులను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తున్నా ఆ సమస్యను పరిష్కరించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తెలంగాణ ఏర్పాడ్డాక అయినా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందేమో అనుకొంటే, కేసీఆర్ దొర పట్టించుకోవడమే లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, టిఆర్ఎస్, బిజెపి రాజకీయాలు, మునుగోడు ఉపఎన్నికల గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఫ్లోరైడ్ సమస్య గురించి చెప్పుకొంటున్నాము కనుక వాటన్నిటినీ పక్కన పెడితే, గతంలో కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రాన్ని సుదీర్గకాలం పరిపాలించిది కనుక ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి కూడా భాగం ఉంది. కనుక ఆయన చేసిన ఈ ఆరోపణపై మీడియా నిలదీస్తే ఇది ముందుగా కాంగ్రెస్ మెడకే చుట్టుకొంటుంది. కాంగ్రెస్ హయాంలో తీర్చలేని సమస్యను రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే తీర్చుతామని రేవంత్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
2014, 2018 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చాలా మంది టిఆర్ఎస్‌లో చేరిపోయారు. మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయాలు చేయడం, గాంధీ భవన్‌లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడం లేదా తమలో తాము కుమ్ములాడుకోవడం తప్ప తమ నియోజకవర్గాలకు చేసిందేమీ లేదని వారికీ తెలుసు. మునుగోడు ఎమ్మెల్యేగా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని స్వయంగా చెప్పుకొంటున్నారు. కనుక ప్రజలు మళ్ళీ తమ పార్టీకే ఎందుకు ఓట్లు వేయాలో రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది.