కాంగ్రెస్‌కు షాక్... కారెక్కుతున్న వామపక్షాలు

August 20, 2022


img

ఒకప్పుడు తెలంగాణలో వామపక్షాలు చాలా బలంగా ఉండేవి కానీ టిఆర్ఎస్‌ ధాటికి అవి కూడా తమ ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకొన్నాయి. కనుక ప్రతీ ఎన్నికలలో ఏదో ఓ ప్రధానపార్టీకి తోకపార్టీలుగానే మనుగడ సాగిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని అవి సూత్రప్రాయంగా నిర్ణయించుకొన్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నేతలు సిఎం కేసీఆర్‌ను కలిసి తెలియజేసినట్లు సమాచారం. 

బిజెపి నుంచి గట్టి సవాలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్‌కు ఇది చాలా ఊరట కలిగిస్తుంది. కనుక సిఎం కేసీఆర్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని నేడు మునుగోడులో జరుగబోయే ప్రజాదీవెన బహిరంగసభలో పాల్గొని మద్దతు ప్రకటించవలసిందిగా కోరారు. హైదరాబాద్‌ నుంచి తన కారులోనే మునుగోడుకి కలిసి వెళదామని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కనుక కమ్యూనిస్టులు గులాబీ కారెక్కడానికి సిద్దమైనట్లే! 

ఈ ఉపఎన్నికలు ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగనున్నాయి కనుక ఓడిపోయే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడం కంటే, బిజెపిని ఎదిరిస్తున్న టిఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడమే మంచిదని వామపక్షాలు భావించినట్లు తెలుస్తోంది.  

నిజానికి వామపక్షాలు తమకు మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశపడింది. కాంగ్రెస్‌ నేతలు వారిని కలిసి మద్దతు అడగాలనుకొన్నారు కూడా. కానీ ఈలోగానే కమ్యూనిస్టులు కారెక్కెస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. 

ఎందుకంటే, మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కి చాలా కష్టం. దాదాపు అసంభవం. కనుక నల్గొండ జిల్లాలో కాస్త పట్టు, ఓటు బ్యాంక్ ఉన్న కమ్యూనిస్టులు మద్దతు ఇస్తే ఈ ఉపఎన్నికలలో గౌరవంగా బయటపడవచ్చని భావించింది. కానీ కమ్యూనిస్టులు కారెక్కెస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేడు మునుగోడులో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నల్గొండ జిల్లాపై మంచి పట్టున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆయనకు సహకరించేందుకు సిద్దంగా లేరు. కనుక మునుగోడులో రేవంత్‌ రెడ్డి ఒంటరి పోరు తప్పదు.


Related Post