కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ సూటి ప్రశ్నలు

August 20, 2022


img

మునుగోడు ఉపఎన్నికలు ముంచుకు రావడంతో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఇప్పటికే జరుగుతున్న రాజకీయ యుద్ధాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరుపార్టీల నేతలు తమ ప్రత్యర్ధులకు సంధిస్తున్న ప్రశ్నలు చేస్తున్న విమర్శలు చాలా ఆలోచింపజేస్తున్నాయి. 

హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాలలో ఉన్నవారు కొంత హుందాతనం పాటించాలి. మేము 21న మునుగోడులో బహిరంగసభ పెట్టుకొంటుంటే సిఎం కేసీఆర్‌ పోలీసులతో, టిఆర్ఎస్‌ నేతలతో మాకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. చివరికి సొంత పార్టీకే చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూడా కేసీఆర్‌ భయబ్రాంతులను చేస్తూ చాలా నీచరాజకీయాలు చేస్తున్నారు. మా సభకు జనాలు ఎవరూ రాకుండా అడ్డుకొనేందుకే ఊరికో మంత్రిని, ఎమ్మెల్యేని దింపి కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

మేము బహిరంగసభ పెట్టుకొంటున్నామని తెలిసి మాకంటే ఒకరోజు ముందే మునుగోడులోనే బహిరంగసభ నిర్వహించడం సిఎం కేసీఆర్‌లో అభద్రతాభావాన్ని సూచిస్తోంది. ఆయన బహిరంగసభ పెట్టుకొంటే పెట్టుకోవచ్చు. దానిలో తాను చెప్పదలచుకొన్నది చెప్పుకోవచ్చు. కానీ మా సభకు ఎవరూ వెళ్లకూడదని ప్రజలపై ఆంక్షలు విధించడం దేనికి? 

సిఎం కేసీఆర్‌ తన అధికారాన్ని, పోలీసులను అడ్డంపెట్టుకొని మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంచి ఉపఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో కూడా ఇటువంటి ప్రయత్నాలే చేసి భంగపడిన కేసీఆర్‌కు బుద్ధి రాలేదు. కనుక మళ్ళీ మరోమారు మునుగోడులో కూడా ప్రజలు ఆయనకు బుద్ధి చెపుతారు. 

ఇంతవరకు మునుగోడు అభివృద్ధిని పట్టించుకొని సిఎం కేసీఆర్‌ ఉపఎన్నికలు రాగానే హడావుడిగా అభివృద్ధి పనులు చేపట్టారు. మునుగోడు సభలో ప్రజలకు వరాలు కూడా కురిపిస్తారు. అంటే ఉపఎన్నికలు వస్తే తప్ప నియోజకవర్గాలను, ప్రజలను సిఎం కేసీఆర్‌ పట్టించుకోరన్న మాట! అందుకే రాష్ట్రంలో ప్రజలు తమ నియోజకవర్గాలలో ఉపఎన్నికలు రావాలని కోరుకొంటున్నారు. 

కానీ సిఎం కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓటమి ఖాయం. హుజురాబాద్‌తోనే టిఆర్ఎస్‌ పతనం ప్రారంభం అయ్యింది. మునుగోడు ఉపఎన్నికల తర్వాత టిఆర్ఎస్‌ చాలా వేగంగా పతనం అవుతుంది. ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బిజెపిలోకి క్యూ కట్టబోతున్నారు. ఎల్లకాలం ఆయనే అధికారంలో ఉండగలనని అనుకోవడం దురాశ, భ్రమ మాత్రమే. కేసీఆర్‌ గద్దె దిగడం, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం రెండూ ఖాయమే.  

కాళేశ్వరం ప్రాజెక్టును నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను... నేనే కట్టించాను అని ఇంతకాలం కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొనేవారు కదా? మరిప్పుడు దాని గురించి ఎందుకు నోరు విప్పడం లేదు?ఆ ప్రాజెక్టులో మునిగిపోయిన పంపు హౌసులలో ఎంత నష్టం జరిగిందో ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ ప్రాజెక్టు క్రెడిట్ తనదేనని కేసీఆర్‌ చెప్పుకొన్నప్పుడు దానిలో జరిగిన నష్టానికి, లోపాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలి కదా? పంప్ హౌసులో ఏమి జరుగుతోందో ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? అక్కడికి మీడియాని, ప్రతిపక్షాలను వెళ్ళనీయకుండా పోలీసులతో ఎందుకు అడ్డుకొంటున్నారు? మేమేమైన ఉగ్రవాదులమా?” అంటూ ఈటల రాజేందర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.


Related Post