తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ వార్తలలోకి వచ్చారు. అయితే ఆయన చేస్తున్న సినిమాల గురించి కాదు రాజకీయ ప్రవేశం గురించి ఆ వార్తలు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చినట్లు వాటి సారాంశం.
రజనీకాంత్ ఇటీవలే ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి పెద్దలను కలిసి వచ్చారు. చెన్నై తిరిగిరాగానే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవితేతో భేటీ అయ్యారు. తామిద్దరం రాజకీయాలే మాట్లాడుకొన్నామని కానీ ఆ వివరాలు బయటకు చెప్పదలచుకోలేదని రజనీకాంత్ నిర్మొహమాటంగా మీడియాకు చెప్పడం విశేషం. కనుక త్వరలో ఆయన గవర్నర్ పదవి చేపట్టే అవకాశం ఉందని తమిళ మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన ఖండించకపోవడంతో అవి నిజమేనని అందరూ భావిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలలోకర్ణాటకలో బిజెపి పాగా వేయగలిగింది. తెలంగాణలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో నేరుగా అధికారంలోకి రాలేమని గుర్తించిన బిజెపి అధికార అన్నాడిఎంకె నేతలని, ముఖ్యమంత్రిని తన చెప్పుచేతల్లో పెట్టుకొంది. ప్రభుత్వమైతే బిజెపి చేతిలో ఉంది కానీ ప్రజలు లేరు. కనుక వారిని ఆకట్టుకొనేందుకు రజనీకాంత్‌ను బిజెపిలో చేర్చుకోవాలని విఫలయత్నాలు చేసింది. కానీ అదీ సాధ్యపడలేదు. కనుక ఇప్పుడు ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చిన్నట్లయితే, ఆయన బిజెపికి అనుకూలంగా ఉంటారు. ఉండకపోయినా ఉన్నట్లు ప్రజలు, అభిమానులు నమ్ముతారని కేంద్రం భావిస్తున్నట్లుంది.
ఇది నిజమో కాదో ఇంకా తెలియదు. కానీ ఒకవేళ ఇది నిజమే అయితే, రజనీకాంత్ గవర్నర్ పదవికి ఆశపడి ఒప్పుకొంటే అది ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటే అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశిస్తానని చాలా ఏళ్ళపాటు చెప్పి అనారోగ్యకారణాల చేత ఆ ఆలోచన విరమించుకొన్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఇప్పుడు ఆయన గవర్నర్ పదవికి ఆశ పడితే బీజేపీ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పదవికి ఆయన ఆశపడితే తప్పకుండా తమిళనాడులోనే ఇవ్వాలని కోరుకొంటారు. కేంద్రప్రభుత్వం కూడా అదే కోరుకొంటోంది. తమిళనాడులో ఏదో రకంగా పాగా వేయాలని ఆశపడుతున్న బీజేపీ అన్నాడీఎంకె ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ప్రయత్నిస్తే దానికి ఆయన సహకరించవలసి ఉంటుంది. అలా చేస్తే తమిళనాడులో ఆయన ప్రతిష్ట మంటగలుస్తుంది. కనుక రజనీకాంత్ సినిమాలకే పరిమితం అయితే సగౌరవంగా జీవితం కొనసాగించవచ్చు.