విద్యుత్ కొనుగోలు, అమ్మకాలలో 13 రాష్ట్రాలపై నిషేదం

August 19, 2022


img

ఏపీ, తెలంగాణతో సహా దేశంలోని 13 రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై తాత్కాలికంగా నిషేదం విధించింది. దేశంలో అన్ని రాష్ట్రాలు అవసరమైన విద్యుత్ కొనుగోలు, మిగులు విద్యుత్ అమ్మకాలను విద్యుత్ ఎక్స్‌చేంజీల ద్వారా చేస్తుంటాయి. అయితే దేశంలో 13 రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించనందున నేటి నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై నిషేదం విధించింది.

నిషేదం విధించిన రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, ఝార్ఖండ్, బీహార్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌, మణిపూర్, మిజోరం, రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ బకాయిలు చెల్లించేవరకు విద్యుత్ ఎక్స్‌చేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేవు. 

అయితే కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత దానికి బిల్లులు చెల్లించడానికి 45 రోజులు గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఎంత విద్యుత్ సరఫరా జరిగింది?దానికి డిస్కమ్‌లు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?రాష్ట్రాలు ఎక్స్‌చేంజీలకు ఎంత మిగులు విద్యుత్ ఇచ్చాయి?దానిని మినహాయించుకొని ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంటుంది?వంటి లెక్కలు కట్టుకొని బిల్లులు చెల్లించడానికే 45 రోజుల వ్యవధి ఏర్పాటు చేశారు. 

ఈ లావాదేవీల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎల్‌పీఎస్ పోర్టల్‌ ఏర్పాటు చేసింది. దానిలో జూలై, ఆగస్ట్ నెలల్లో వివిద రాష్ట్రాలు కొనుగోలు చేసిన విద్యుత్‌కి బకాయిలు ఎంత చెల్లించాలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఆయా రాష్ట్రాలు చెల్లించిన బకాయిల వివరాలు ఇంకా ఎల్‌పీఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. కనుక ఆ రాష్ట్రాలన్నీ విద్యుత్ బకాయిలు చెల్లించనట్లు పరిగణించి కేంద్రం నిషేదం విదించేసింది. బిల్లులు చెల్లించాల్సిన రాష్ట్రాలు బకాయిలు చెల్లించేవరకు, ఇప్పటికే చెల్లించిన రాష్ట్రాల వివరాలు ఎల్‌పీఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యేవరకు రాష్ట్రాలలో డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు నిలిచిపోయి మళ్ళీ స్వల్పంగా ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఇటువంటి సమయంలో అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించింది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ కోతలను తప్పించేందుకు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ని తగ్గించే అవకాశం ఉంది. 

జూన్ నెలలో కొనుగోలు చేసిన విద్యుత్‌కి తెలంగాణ రాష్ట్రం రో.1,600 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.350 కోట్లు బకాయిఊ చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. 


Related Post