మునుగోడు ముంగిట కీచులాటలతో కాంగ్రెస్‌ నేతల కాలక్షేపం

August 17, 2022


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌ రెడ్డిని సైన్యం లేని నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన సిఎం కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించినా ఆయన వెనక నడిచేవారు ఎవరూ కనబడటం లేదు. మొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనపై ఏవిదంగా విరుచుకుపడ్డారో అందరూ చూశారు. రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పుకొన్నప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. ఇక రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడుతున్న పాపానికి పార్టీ ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్ కూడా విమర్శలు భరించాల్సి వస్తోంది. ఆయన రేవంత్‌ రెడ్డికి ఏజంట్‌లా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీ గురించి ఆలోచించడం లేదని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. 

మర్రి వ్యాఖ్యలపై మానిక్కం ఠాగూర్ స్పందిస్తూ, “నేను కేవలం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీల ఏజంట్‌ని తప్ప ఎవరి ఏజంట్‌ని కాను. కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి నేతలున్నారు కానీ నేతలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడి లేదని గ్రహిస్తే మంచిది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు కనుక ఆయన ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళాను. బిజెపిలో చేరాలనుకొంటున్నవాళ్ళే నాపై ఆరోపణలు చేస్తారు తప్ప పార్టీలో ఉండాలనుకొనేవారు చేయరు. ఎందుకంటే నేను ఎటువంటి వాడినో అందిరికీ బాగా తెలుసు. తెలంగాణ పార్టీ పరిస్థితులు, నేతల తీరుతెన్నులు సోనియా గాంధీ ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉన్నారు. ఒకవేళ ప్రియంకా గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకొంటానంటే సంతోషంగా అప్పగిస్తాను,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు తమలో తాము ఈవిదంగా కుమ్ములాడుకొంటుంటే అసెంబ్లీ ఎన్నికలు కాదు కదా కనీసం మునుగోడు ఉపఎన్నికలలో కూడా గెలవలేమనే సంగతి గ్రహించినట్లు లేదు. మానిక్కం ఠాగూర్ చెప్పినట్లు పార్టీ ఉంటేనే నేతలకు మనుగడ అని గుర్తిస్తే మంచిది. కానీ పార్టీని మరిచి తమ వ్యక్తిగత కక్షలతో కీచులాడుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోయి ఉంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు. 


Related Post