సిఎం కేసీఆర్‌ నోట గాంధీ, నెహ్రూల ప్రస్తావన... అందుకేనా?

August 17, 2022


img

అపర చాణక్యుడిగా పేరుగాంచిన సిఎం కేసీఆర్‌ కూడా తెలంగాణలో బిజెపి ఇంత త్వరగా బలపడి తనకు సవాలు విసరగలదని ఊహించలేకపోయారు. జరిగిందేదో జరిగిపోయింది కనుక ఇక జరగాల్సింది చూడాలి. ముందుగా మునుగోడు ఉపఎన్నికల అగ్ని పరీక్ష ఎదుర్కొని విజయం సాధించాలి లేకుంటే టిఆర్ఎస్‌కు ముఖ్యంగా కేసీఆర్‌ ప్రతిష్టకు ఇంకా నష్టం జరుగుతుంది. దానికి జోరుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. 

కానీ మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచినా ఓడినా అక్కడితో ఈ కధ ముగిసిపోదు. మళ్ళీ మొదలవుతుంది. కనుక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిఎం కేసీఆర్‌ అప్పుడే మెల్లగా పావులు కదుపుతున్నట్లున్నారు. 

ఇటీవల కాలంలో సిఎం కేసీఆర్‌ ప్రసంగాలలో గాంధీ, నెహ్రూల పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. అంతకు ముందు కాంగ్రెస్‌ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తున్నారని తెలిసి ఉన్నా, ఆయన సేవలు ఉపయోగించుకొంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌ను కలుపుకోకుండా జాతీయ స్థాయిలో మోడీని, బిజెపిని ఢీకొని నిలవడం సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారు. కనుక సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో బిజెపిని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి సిద్దం అవుతున్నారేమో?అనే సందేహం కలుగుతోంది.

రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మద్య దోస్తీ సాధ్యం కాకపోయినా జాతీయ స్థాయిలో దోస్తీ సాధ్యమే అని చెప్పవచ్చు. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ మద్దతుగా నిలిస్తే, కాంగ్రెస్‌ అధిష్టానం కూడా రాష్ట్ర స్థాయిలో బిజెపిని అడ్డుకొనేందుకు టిఆర్ఎస్‌కు సహకరించవచ్చు. బహుశః అందుకే గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానానికి సానుకూల సంకేతాలు పంపిస్తున్నారేమో? ఈ ఊహాగానాలు నిజమవుతాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.


Related Post