మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు... ఆ సంస్కృతి మనకేల?

August 13, 2022


img

భారత్‌ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్‌లో జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. దానిలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పక్కనే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నుంచి తుపాకీ తీసుకొని ర్యాలీ ప్రారంభానికి సంకేతంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

దీనిపై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీసుల తుపాకులను వారు తప్ప ఇతరులు ఎవరూ వాడకూడదు. పోలీసులు కూడా అత్యవసర పరిస్థితులలో అదీ.. తమ పై అధికారుల ఆదేశిస్తేనే ఉపయోగించాలి తప్ప ఇష్టం వచ్చినట్లు వాడటానికి వీలు లేదు. తుపాకీలో ప్రతీ బులెట్‌కి సదరు పోలీసు లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది.

ఇంత కటినమైన నిబందనలు అమలులో ఉండగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన చుట్టూ వేలాదిమంది ప్రజలు గుమిగూడి ఉండగా తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపడం సరికాదని నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఆ తూటా అక్కడ ఉన్నవారిలో ఎవరికైనా తగిలితే అప్పుడు మంత్రిగారు ఏమి సమాధానం చెపుతారు?ఆయనకు తుపాకీ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఏం సమాధానం చెపుతారు?ఇద్దరిలో ఎవరు దానికి బాధ్యత తీసుకొంటారు?అంటూ  నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈవిషయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి రావడంతో స్పందిస్తూ, “నేను పేల్చింది రబ్బర్ బుల్లెట్. అదీ.. ర్యాలీ ప్రారంభోత్సవం కోసం జిల్లా ఎస్పీ స్వయంగా ఇచ్చిన తుపాకీ. పోలీసుల చేతిలో తుపాకీ లాక్కొని కాలిస్తే పోలీసులు చూస్తూ ఊరుకొంటారా? ఇదివరకు ఓసారి రబ్బర్ బుల్లెట్ గన్‌తో పేల్చి క్రీడలను ప్రారంభించాను. నేను ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని కనుక నాకు తుపాకీ వినియోగం గురించి క్షుణ్ణంగా తెలుసు,” అని అన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తుపాకీ వినియోగం గురించి పూర్తి అవగాహన ఉండి ఉండవచ్చు. అది రబ్బర్ బుల్లెట్ అయ్యుండవచ్చు. కానీ అంతమంది జనంలో తుపాకీ పేల్చడం అవసరమా?యూపీ, బీహార్‌ రాష్ట్రాలలో పదవులలో ఉన్నవారు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం వలననే అక్కడ అదో దుసాంప్రదాయంగా మారి, ఇప్పుడు పెళ్ళిళ్ళు, వేడుకలో కూడా తుపాకులు పేల్చడం ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి తుపాకీ సంస్కృతి మనకు అవసరమా? మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలోచిస్తే బాగుంటుంది. 


Related Post