తెలుగు సినీ పరిశ్రమ ఓ పక్క జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంటుంటే, మరోపక్క సమస్యల వలయంలో చిక్కుకొని సినిమా షూటింగులు నిలిపివేసుకొని కూర్చోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా టికెట్ రేట్లు పెంచకపోవడం వలన లేదా హీరోల పారితోషికాలు పెరిగిపోవడం వలన లేదా ఓటీటీల వలన నష్టపోతున్నామని నిర్మాతలు రకరకాల కారణాలు చెపుతున్నారు. అయితే వాటిపై నిర్మాతలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం. సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌లు నిలిపివేయడం సరికాదని ఒకరు, మూడు-నాలుగు నెలల్లో తీయాల్సిన సినిమాలను వందల కోట్లు ఖర్చుచేసి 3-4 ఏళ్ళు తీయడం వలన నష్టపోతున్నామని, కధల ఎంపికలో పొరపాట్ల వలన నష్టపోతున్నామని మరికొందరు వాదిస్తున్నారు. ఈవిదంగా ఎవరి కారణాలు వారికున్నాయి.
అయితే ఈరోజు విడుదలైన కార్తికేయ2, గత వారం విడుదలైన సీతారామం, బింబిసార సినిమాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. భారీ, మీడియం బడ్జెట్‌లతో తీసిన సినిమాలు విడుదలైనప్పుడు నెలకొన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయి. వరుసగా మూడు సినిమాలు విడుదలై వాటి మద్య పోటీ ఉన్నా ఎందుకు విజయవంతమయ్యాయి? అని తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు ఆలోచించాలి.
మూడు సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే, మంచి బలమైన కధ, దానిని అంతే సమర్ధంగా తెరపై చూపగలడం, తక్కువ కాలంలో, తక్కువ బడ్జెట్‌లో సినిమాలను పూర్తిచేయడం.
వీటిలో కార్తికేయ2 అనేక సార్లు వాయిదా పడినప్పటికీ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో ప్రేక్షకులే కాదు సినీ పరిశ్రమలో వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. సినిమా తృప్తిగా ఉంటే డబ్బు చెల్లించి చూసిన ప్రేక్షకులు సంతోషిస్తారు. వారి మౌత్ టాక్ ద్వారా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు. సినిమా హిట్ అయితే దర్శక, నిర్మాతలు, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషిస్తారు. కనుక సమస్యలు, లోపాలు తమలో పెట్టుకొని ఇతరులనో, ఓటీటీలనో నిందించడం దేనికి? కనుక ఈ మూడు సినిమాల నుంచి ఇండస్ట్రీ ఏమైనా నేర్చుకోగలిగితే వారికే మంచిది.