మునుగోడు ఉపఎన్నికలకు ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు కానీ అప్పుడే మూడు ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో యుద్ధం ప్రారంభించడం గమనిస్తే ఈసారి హుజురాబాద్ ఉపఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా జరగనున్నాయని స్పష్టం అవుతోంది.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బొమ్మతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణపురం, చౌటుప్పల్‌లో గోడలపై ఈరోజు తెల్లవారుజామున ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.వాటిలో “మునుగోడు నిన్ను క్షమించదు. 22 వేల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకొన్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేదిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి, “ అని వ్రాసి ఉన్నాయి.
ఇటువంటి వాదన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు కనుక ఆయన అనుచరులే ఈ పోస్టర్స్ ముద్రించి అంటించారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టిఆర్ఎస్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం విదిలించిన కాంట్రాక్ట్ కోసం బిజెపిలో చేరారని వాదిస్తోంది. కానీ ఈ పోస్టర్లలో సోనియా గాంధీ ప్రస్తావన ఉంది కనుక ఇది టిఆర్ఎస్ పని అయ్యుండకపోవచ్చు.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే కాన్సెప్ట్ తో ఇటువంటి యుద్ధం మొదలైంది కనుక మున్ముందు బిజెపి, టిఆర్ఎస్‌లు కూడా ఇదేవిదంగా యుద్ధం కొనసాగించవచ్చు. తెలంగాణ రాజకీయాలు మరో మెట్టు దిగజారడం చాలా బాధాకరమే. ఇటువంటి యుద్ధాలతో రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో?