కేసీఆర్‌ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్‌ శ్రేణులు

August 13, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కానీ మునుగోడు నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్‌ నేతలు ఆయనను అభ్యర్ధిగా అంగీకరించబోమని తెగేసి చెపుతుండటంతో మంత్రి జగదీష్ రెడ్డి వారందరినీ ప్రగతి భవన్‌కు తీసుకువెళ్ళి సిఎం కేసీఆర్‌ చేత నచ్చజెప్పించారు. 

అప్పుడు అందరూ తలలూపి బయటకి వచ్చినప్పటికీ వారు తమ అభిప్రాయం మార్చుకోకపోవడం విశేషం. అంతేగాదు... వారందరూ శుక్రవారం దండుమల్కాపూర్‌లోని ఆందోల్ మైసమ్మ గుడి వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారందరూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తప్ప వేరెవరికి టికెట్ ఇచ్చినా బలపరచాలని, ఒకవేళ కూసుకుంట్లకే టికెట్ ఖరారు చేస్తే ఉపఎన్నికలో ఆయనకు సహకరించకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.   

ఈవిషయం సిఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని శనివారం ప్రగతి భవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి పేరును ఈనెల 20న మునుగోడులో జరుగబోయే బహిరంగసభలో నేనే స్వయంగా ప్రకటిస్తాను. కనుక అభ్యర్ధి గురించి ఎవరూ అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు,” అని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


Related Post