మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కల్లోల్లం సృష్టిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే కాంగ్రెస్ పార్టీ చండూరులో బహిరంగ సభ నిర్వహించగా, దానిలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకి పో..” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అద్దంకి వ్యాఖ్యలపై కె.జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇక వెంకట్ రెడ్డి సరేసరి. తన నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డే దయాకర్‌ను తనపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. సభలో అద్దంకి దయాకర్ తనను అంతగా విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు ఎవరూ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అద్దంకి దయాకర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బహిరంగసభలో తనను ఇంతగా అవమానించి మళ్ళీ మునుగోడు ఉపఎన్నికల ప్రచారసభలో పాల్గొనాలని కోరడం సిగ్గుచేటని అన్నారు. అయినా తనను ఎవరూ పిలవలేదని, పిలవని పేరంటానికి వెళ్ళబోనని వెంకట్ రెడ్డి అన్నారు.
ఈ వ్యవహారం ముదురుతుండటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వగా అప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పుకొన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయసహకారాలు ఎంతో అవసరమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే ఆయనకు బహిరంగ క్షమాపణలు చెపుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరం అని అటువంటి వ్యక్తికి బాధ కలిగించడం చాలా పొరపాటే అని కనుక అందుకు ఆయనకు ఈ వీడియో ద్వారా సారీ చెపుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే వెంకట్ రెడ్డి ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు. తన వంటి సీనియర్ నేత, ఎంపీని బహిరంగసభలో అందరి ముందు తనను ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడిన అద్దంకి దయాకర్‌ను పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే తప్ప మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కనుక ఈరోజు మునుగోడులో జరుగుతున్న కాంగ్రెస్ పాదయాత్రలో ఆయన పాల్గొనలేదు.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్‌లలో ఎవరిని రేవంత్ రెడ్డి వదులుకొంటారు? ఇద్దరినీ నిలుపుకొని, కలుపుకొని మునుగోడు ఉపఎన్నికలలో ముందుకు సాగడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.