సిఎం కేసీఆర్ గురువారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన నేతలందరూ హాజరయ్యారు కానీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌లో జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పట్నం వర్గీయుల మద్య విభేదాలు తలెత్తాయి. అవి ఏ స్థాయి వరకు వెళ్ళాయంటే పరస్పరం రాళ్ళ దాడులు చేసుకొనేంత వరకు. జిల్లాలో మరికొందరు టిఆర్ఎస్ నేతలతో కూడా పట్నం దంపతులకు పొసగడం లేదు. కానీ పార్టీ అధిష్టానం వారినే సమర్ధిస్తుండటంతో పట్నం దంపతులు సైలెంట్ అయిపోయారు.
వారి పరిస్థితిని చూస్తున్న బిజెపి నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈవిషయం సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లింది. కనుక నిన్న వికారాబాద్ జిల్లా నేతల సమావేశానికి పట్నం దంపతులను కేసీఆర్ పిలవలేదా లేక పార్టీ మారే ఉద్దేశ్యంతో వారే ఈ సమావేశానికి వెళ్ళలేదా?అనే విషయం తెలియదు. కానీ వికారాబాద్ టిఆర్ఎస్‌లో త్వరలోనే కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.