ఒకప్పుడు ఎన్నికలంటే ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేసే టిఆర్ఎస్ ఇప్పుడు ఉపఎన్నికలంటే ఉలిక్కిపడుతోంది. ఆ ఉలికిపాటు దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల ప్రభావమే అని అందరికీ తెలుసు. బిజెపి కూడా ఈవిషయం బాగానే గ్రహించింది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్ళీ టిఆర్ఎస్‌కు ఉపఎన్నికల అగ్నిపరీక్ష తెచ్చిపెట్టింది.
నిజానికి టిఆర్ఎస్ ఉపఎన్నికలు వద్దనుకొంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేత ఆయన రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టించవచ్చు కానీ తక్షణమే ఆమోదించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. తద్వారా టిఆర్ఎస్ కూడా నుగోడు ఉపఎన్నికలకు సిద్దమేనని స్పష్టమైన సంకేతం ఇవ్వగలిగింది.
కానీ ఇల్లలకగానే పండగ కాదన్నట్లు రాజీనామా ఆమోదించగానే టిఆర్ఎస్ గెలిచేయగలదని కాదు. కానీ ఉపఎన్నికల కత్తి మెడపై వ్రేలాడుతోంది కనుక ఈసారి కూడా ఎప్పటిలాగే ఈ బాధ్యతను మంత్రి హరీష్‌రావుకు అప్పగించింది. అయితే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ బిజెపి చేతిలో టిఆర్ఎస్ ఓటమి తప్పలేదు. ఈసారి మునుగోడు ఉపఎన్నికలలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనను మునుగోడులో ఎవరూ ఓడించలేరనే గట్టి నమ్మకంతోనే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. ఆయన వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే చాలా శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కారణంగా రేవంత్ రెడ్డి మునుగోడు సీటును ఎలాగైనా గెలుచుకొని తన సత్తా చాటుకొని పార్టీ పట్టు నిలుపుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ ఉపఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించలేకపోయినా ఓట్లు చీల్చి టిఆర్ఎస్ గెలుపును అడ్డుకోగలరు. కనుక ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ తప్పదు.
కనుక ఈ ఉపఎన్నికలు మంత్రి హరీష్ రావుకు మరో అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో ఆయన టిఆర్ఎస్‌ను గెలించగలిగితే రాష్ట్రంలో బిజెపి దూకుడికి కళ్ళెం వేసినట్లే అవుతుంది. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలకు మునుగోడులో బిజెపిపై ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది. మరి ఉపఎన్నికలలో ఈ మూడు పార్టీలలో ఏది గెలుస్తుందో చూడాలి.