జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్ బీహార్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆయన తొందరపడకుండా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
గత 5 ఏళ్ళుగా జేడీయూ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. బీహార్ ప్రభుత్వంలో కూడా బిజెపి భాగస్వామిగా ఉంది. కానీ బిజెపి తన పార్టీలోనే చీలిక తెచ్చేందుకు కుట్రలు పన్నుతోందని గుర్తించిన, నితీశ్ కుమార్ చకచకా పావులు కదిపి బిజెపి, ఎన్డీయేలను ని వదిలించుకొని తన ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకొన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ మర్నాడే ఆర్‌జేడీ (తేజస్వీ యాదవ్)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
అంతకు ముందు మహారాష్ట్రలో కూడా శివసేన ప్రభుత్వాన్ని ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్ప సాయంతో ఇలాగే కూల్చివేసి బిజెపి అధికారం చేజిక్కించుకొంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా టిఆర్ఎస్‌లోని కట్టప్పల సాయంతో గద్దె దించుతామని కె.లక్ష్మణ్ బహిరంగంగానే చెప్పారు.
ఈవిదంగా ప్రజాప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చివేస్తున్న బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిఎం కేసీఆర్‌కు మరో మంచి అవకాశం లభించింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్ తదితర ముఖ్యమంత్రులతో కేసీఆర్ దోస్తీ కుదిరింది. ఇప్పుడు ఆ జాబితాలో కొత్తగా నితీశ్ కుమార్ కూడా చేరారు. కనుక కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు తగిన వాతావరణం ఏర్పడినట్లే ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికల అగ్నిపరీక్ష ఒకటి ఉంది. కనుక అది ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తారేమో?