పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్, బిజెపిలు బొమ్మాబొరుసు వంటివి. అవి పైకి వేర్వేరుగా కనిపిస్తున్న అవి కలిసే ఉంటాయి. నరేంద్రమోడీని గద్దె దింపుతానని పిల్లి శపధాలు చేస్తున్న సిఎం కేసీఆరే మొన్న ప్రెస్‌మీట్‌లో నరేంద్ర మోడీ నా ఆప్తమిత్రుడు అని స్వయంగా చెప్పారు. వారి మద్య రహస్య అవగాహన కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపిలోకి చేర్చుకొనే ముందు ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం కూడా వారి రహస్య అవగాహనలో భాగమే.
గతంలో ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలు సమర్పిస్తే నెలల తరబడి పక్కన పెట్టేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సమర్పించగానే 5 నిమిషాలలో ఆమోదించేశారు. ఎందుకు?హుజురాబాద్‌లో గెలుపు టిఆర్ఎస్‌కు చాలా అవసరం కానీ కావాలనే అక్కడ టిఆర్ఎస్ బలహీనమైన అభ్యర్ధిని నిలబెట్టి బిజెపిని గెలిపించారు.
ఇప్పుడు మునుగోడులో గెలుపు కాంగ్రెస్‌కు అవసరం కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టిఆర్ఎస్-బిజెపిలు తెర వెనుక చేతులు కలిపి సహకరించుకోబోతున్నాయి. కనుక మునుగోడు ప్రజలు తమ నమ్మకాన్ని వమ్ముచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఆయన గెలుపుకి సహకరించబోతున్న టిఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలనుకొంటే కాంగ్రెస్ అభ్యర్ధినే గెలిపించాలి,” అని అన్నారు.