తెలంగాణ బిజెపి ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్‌

August 11, 2022


img

తెలంగాణ బిజెపి ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ స్థానంలో సునీల్ బన్సల్‌ నియమితులయ్యారు. సునీల్ బన్సల్‌కు మేధావిగా మంచి పేరుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహాలలో ఆయన గొప్ప నిపుణుడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో, ముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించడంలో సునీల్ బన్సల్‌ కీలకపాత్ర పోషించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడు. 

సునీల్ బన్సల్‌కు తెలంగాణ బిజెపి బాధ్యతలు అప్పగించడం ద్వారా తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం ఎంత పట్టుదలగా ఉందో అర్దం చేసుకోవచ్చు. త్వరలో మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతున్న తరుణంలో సునీల్ బన్సల్‌కు తెలంగాణ బిజెపికి ఇన్‌ఛార్జిగా నియమించడం ద్వారా మునుగోడును కూడా చేజార్చుకోవడానికి బిజెపి సిద్దంగా లేదని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. 

తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసుకొనేందుకు టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బిజెపి ‘చేరికల సమన్వయ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసుకొంది. కనుక సునీల్ బన్సల్‌ రాకతో తెలంగాణలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫిరాయింపులు కూడా పెరిగే అవకాశం ఉంది. తత్ఫలితంగా టిఆర్ఎస్‌, బిజెపి కాంగ్రెస్ పార్టీల మద్య ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఆదిపత్యపోరు పతాకస్థాయికి చేరుకోవచ్చు.


Related Post