నిరు పేదలకు సంక్షేమ పధకాలు తప్పు కాదు: కవిత

August 10, 2022


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నిరుపేదలను ఆదుకొనేందుకు ఇచ్చే సంక్షేమ పధకాలు వరాలు కావు బ్యాంకులను, ఆర్ధిక సంస్థలను మోసం చేసి కొందరు బడాబాబులు లక్షల కోట్లు అప్పులు చేసి ఎగవేస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడమే వరం. నిరుపేదలను ఆదుకోవడం ప్రతీ ప్రభుత్వం ధర్మం బాధ్యత అని నేను భావిస్తున్నాను. అందుకే మా ప్రభుత్వం తెలంగాణలో సుమారు 250 సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఉచితాలని ముద్రవేసి అన్నిటినీ నిలిపివేయాలని మా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏటా బాడాబాబులు ఎగవేసిన లక్షల  కోట్ల రుణాలను మాఫీ చేస్తుంటుంది. ముందు అది మానుకొంటే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో మంచిది,” అని అన్నారు. 

సంక్షేమ పధకాలపై కల్వకుంట్ల కవిత వ్యక్తం చేసిన అభిప్రాయం నూటికి నూరు శాతం నిజమని అందరికీ తెలుసు. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలలో కూడా అటువంటివి రెండు ఉన్నాయి. అవే రైతు భరోసా, దళిత బంధు. ఆ రెంటినీ తప్ప మిగిలిన ఏ పధకాలను ఎవరూ తప్పుపట్టలేరు. అన్నీ ప్రజలకు చాలా ఉపయోగపడేవే.

నిరుపేద రైతులకు రైతు భరోసాతో ఆర్ధిక సాయం అందించాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. కౌలు రైతులకు ఈ పధకాన్ని ఇవ్వదలచుకోలేదని ఖరాఖండీగా చెపుతున్న సిఎం కేసీఆర్‌ వందల ఎకరాలున్న ధనవంతులైన రాజకీయనాయకులు, సినీ నటులకు, ప్రముఖులకు కు ఈ పధకం ద్వారా అవసరం లేకపోయినా ఏటా లక్షల రూపాయలు ముట్టజెపుతుండటాన్నే అందరూ తప్పుపడుతున్నారు. 

దళిత బంధు పధకంతో దళితులకు చేయూత అందించి వారిని కూడా పైకి తీసుకురావడమే ప్రభుత్వం ఉద్దేశ్యం అని చెపుతున్నప్పుడు ఆ సొమ్మును వారికి వడ్డీ లేని రుణంగా అందించి, వారు నిలద్రొక్కుకొన్నాక తిరిగి ఆ అప్పు తీర్చాలనే షరతుతో ఇచ్చి ఉండి ఉంటే ఎవరూ తప్పి పట్టి ఉండేవారు కారు. కానీ దళిత బంధు పధకం ఎన్నికలలో ఓ గేమ్-ఛేంజర్ అని టిఆర్ఎస్‌ నాయకులే గొప్పగా చెప్పుకొన్నారు. ఓట్ల కోసం ఇటువంటి తలకు మించిన భారం ఎత్తుకొని, ఉచితంగా పంచిపెట్టి దాని కోసం అప్పులు చేయడాన్ని ఎవరూ హర్షించలేరు.


Related Post