మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. బిజెపియే ఈ ఉపఎన్నికను తెచ్చింది కనుక అది సిద్దంగానే ఉంది. ఆ స్థానం కాంగ్రెస్ పార్టీది కనుక దానిని తిరిగి దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సన్నాహాలు ప్రారంభించేసింది. కానీ ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేసే అధికార టిఆర్ఎస్ మాత్రం ఈసారి చాలా ఆచితూచి స్పందిస్తోంది.
“రాష్ట్రంలో అనేక ఉపఎన్నికలు జరిగాయి వాటిలో ఇదీ ఒకటి... దీనికేమీ ప్రత్యేకత లేదు.. ఈ ఉపఎన్నికతో కొత్తగా మారేదేమీ లేదు,” అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం చూస్తే ఈసారి దుబ్బాక, హుజురాబాద్‌లో మాదిరిగా దూకుడుగా వ్యవహరించి అవమానం పాలుకాకూడదని నిర్ణయించుకొన్నట్లు అర్దమవుతోంది.
“స్థిరంగా సాగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే మోడీ, అమిత్ షాలు ఈ ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన తెచ్చిపెట్టారని, ఇదొక రాజకీయ ఎత్తుగడ,” అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు.
మునుగోడు ఉపఎన్నికపై టిఆర్ఎస్ మౌనం వహిస్తుండటంపై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ, “టిఆర్ఎస్ తీరు చూస్తుంటే అది ఈ ఉపఎన్నికను ఎదుర్కోవడం కంటే ముందస్తుకు వెళ్ళేందుకే మొగ్గు చూపుతునట్లుంది. ఎందుకంటే మునుగోడులో టిఆర్ఎస్‌కు బలం లేదు. 2018 ముందస్తు ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకొన్న టిఆర్ఎస్ మునుగోడు సీటు మాత్రం గెలవలేకపోయింది. అప్పుడే రాజగోపాల్ రెడ్డిని ఓడించలేక పోయింది ఇక ఇప్పుడు ఏం ఓడించగలదు? మునుగోడులో టిఆర్ఎస్ ఓడితే పరువు పోతుంది. కనుక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకీ వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. అందుకే మునుగోడు ఉపఎన్నికపై మల్లగుల్లాలు పడుతోంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నాను,” అని అన్నారు.