మోడీ-బాబు షేక్ హ్యాండ్ తెలంగాణ కోసమేనట!

August 09, 2022


img

ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రానికి సంబందం ఉందా? అంటే ఉందనే అంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న డిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృతోత్సవ్‌ సన్నాహక కమిటీ సమావేశంలో చాలా ఏళ్ళ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ- టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఆప్యాయంగా పలకరించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడు తన స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసమే ఎలాగో ఆహ్వానం సంపాదించుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఏపీలో టిడిపితో బిజెపి మళ్ళీ చేతులు కలిపేందుకు అంగీకరిస్తే, తెలంగాణలో బిజెపికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికి ఏవిదంగా మేలు చేయాలని ఆలోచించకుండా తాను ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏమి చేయాలని ఆలోచిస్తుండటం చాలా దురదృష్టకరం,” అని అన్నారు. 

ప్రధాని మోడీ- చంద్రబాబు ఏం మాట్లాడుకొన్నారో ఎవరికీ తెలీదు కానీ వైసీపీ నేతల ఊహాశక్తిని మెచ్చుకోవలసిందే. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మోడీ-బాబు ఇద్దరూ రాజకీయ శత్రువులే. కేసీఆర్‌ వలన చంద్రబాబు గత ఎన్నికలలో నష్టపోయారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ కోరుకొంటున్నారు. తనను గద్దె దింపుతానని శపధాలు చేస్తున్న కేసీఆర్‌ను ముందు గద్దె దింపాలని ప్రధాని నరేంద్రమోడీ భావించడం సహజం. 

కనుక ఒకవేళ చంద్రబాబు అటువంటి ప్రతిపాదన చేయడం నిజమైతే అది నిజంగా ఆలోచింపదగ్గదే. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆంధ్రాకు చెందిన లక్షలాదిమంది స్థిరపడి ఉన్నారు. కనుక వారిని టిడిపి ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికలలో బిజెపి చాలా లబ్ది కలుగుతుంది. టిడిపి సోషల్ మీడియా వారియర్స్ కూడా తెలంగాణలో బిజెపి తరపున పనిచేస్తే ఇక తిరుగే ఉండదు. 

కనుక మోడీ-బాబులకు ఇంతవరకు ఇటువంటి ఆలోచన రాకపోయుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వారికి ఇటువంటి ఆలోచన కలిగించి మహోపకారం చేసినట్లుగానే భావించవచ్చు.


Related Post