షూటింగులు నిలిపివేస్తే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా?

August 08, 2022


img

ప్రపంచానికి వినోదం పంచే సినిమా ఇండస్ట్రీకి ఉన్న కష్టాలు, సమస్యలు మరే ఇండస్ట్రీకి ఉండవేమో అనిపిస్తుంది. అయితే ఆ సమస్యలకి 50 శాతం ఇండస్ట్రీయే కారణమని చెప్పవచ్చు. సినిమా హీరోల పారితోషికం పెంచుకొంటూ పోవడం, అదే సమయంలో జూనియర్ ఆర్టిస్ట్స్, ప్రొడక్షన్ బాయ్స్ జీతాలు పెంచాలంటే నిర్మాతలు బిగుసుకుపోవడం, అవసరం ఉన్నా లేకపోయినా ఒకటి రెండు పాటల కోసం విదేశాలలో షూటింగులు చేయడం, మూడు-నాలుగు నెలల్లో సినిమా తీసే పద్దతిని మరిచి మూడు నాలుగేళ్ళపాటు తీయడం, ఎంత భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తే అంత గొప్ప అన్నట్లు ఫీలవడం... ఇలా కంటికి కనబడుతున్నవే చాలా ఉన్నాయి. బయట సాధారణ ప్రేక్షకులకే ఇండస్ట్రీలో ఇన్ని లోపాలు కనబడుతున్నప్పుడు, కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు, ఎంతో అనుభవం ఉన్న దర్శకులు, నటీనటులకు ఇవన్నీ తెలియవా?అంటే తెలుసనే చెప్పవచ్చు.

కానీ ఇండస్ట్రీలో ఉన్న ఈ లోపాలను సవరించుకోకుండా సినిమా షూటింగులు నిలిపివేసి, ఒక్కో సమస్య పరిష్కరించుకొంటూ వస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చెప్పడం నిస్సహాయతను సూచిస్తోంది. ఒకవేళ ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించేసుకొంటే మళ్ళీ ఎప్పటికీ ఇక ఇండస్ట్రీలో సమస్యలు రావా?అంటే తప్పక వస్తాయని ఎవరైనా చెప్పగలరు. మరి అటువంటప్పుడు సినిమా షూటింగులు నిలిపివేసి కూర్చోవడం దేనికి? అంటే సరైన సమాధానం లభించదు.

ఏ రంగంలోనైనా అందరూ పూర్తిగా నిబందనలకి, క్రమశిక్షణకి కట్టుబడి ఉండరు. సినిమా రంగంలో అసలే ఉండరు. ఎవరి అహంభావాలు వారివి.. ఎవరి లెక్కలు వారివి... ఎవరి సమస్యలు వారివి. ఈ విషయం మా ఎన్నికలు, ఫిలిమ్ ఛాంబర్ సమావేశాలు జరిగిన ప్రతీసారి బయటపడుతూనే ఉంటాయి. సినీ ఇండస్ట్రీని పూర్తిగా గాడిన పెట్టాలనే ఆలోచన ఎన్నటికీ సాధ్యం కాని ఇండస్ట్రీలో ఉన్నవారికే బాగా తెలుసు. కనుక మళ్ళీ షూటింగులు ప్రారంభించుకొని కళ్ళకు కనబడుతున్న ఇటువంటి లోపాలను సరిదిద్దుకొంటూ ముందుకు సాగడమే మంచిది. లేకుంటే చివరికి ఇండస్ట్రీ మొత్తం నష్టపోతుంది.   


Related Post