మునుగోడు ఉపఎన్నికా... ముందస్తు ఎన్నికలా?

August 08, 2022


img

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం తన అనుచరులతో కలిసి గన్‌పార్కుకి వెళ్ళి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన రాజీనామా పత్రం అందించారు. స్పీకర్ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికలు వద్దని భావిస్తే స్పీకర్ దానిని పక్కన పెట్టవచ్చు. కానీ ఆమోదించారు అంటే మునుగోడు ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌ కూడా సై అన్నట్లే... ఉపఎన్నికలకు గంట మ్రోగినట్లే!

బిజెపి తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే రాజీనామాతో బలవంతంగా రాష్ట్రంలో ఉపఎన్నికలు తెచ్చిపెడుతోందని టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు నిజమని దృవీకరిస్తున్నట్లు ఈ ఉపఎన్నిక తర్వాత రాష్ట్రంలో మరిన్ని ఉపఎన్నికలు జరుగనున్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. 

ఈ ఉపఎన్నికతో టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై మళ్ళీ తీవ్ర ఒత్తిడి పడటమే కాకుండా, కేవలం 12 నెలల పదవి కోసం వందల కోట్లు ఎన్నికలలో నీళ్ళలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు ప్రకటించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 15 నుంచి నేతన్నలకు భీమా సౌకర్యం, రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి ఆసరా పింఛన్లు ప్రకటించడమే ఇందుకు తాజా ఉదాహరణ. 

అయితే ఇది ఇక్కడితో ఆగిపోదు. హుజురాబాద్‌ ఉపఎన్నికలు ఖరారు కాగానే ఆ నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేసి హడావుడిగా అభివృద్ధిపనులు చేపట్టాల్సి వచ్చింది. దళిత బంధు పధకం కింద 2,000 మందికి ఒక్కొక్కరికీ పదేసి లక్షలు చొప్పున పంచిపెట్టాల్సి వచ్చింది. కనుక మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నికలలో కూడా ఇవన్నీ తప్పవు.

మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్‌), రాజగోపాల్ రెడ్డి (బిజెపి) సోదరులు చాలా పట్టు కలిగి ఉన్నారు. పోనీ ఇంత శ్రమపడి, ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు టిఆర్ఎస్‌ను గెలిపిస్తారో లేదో అనుమానమే. ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలిచినా, బిజెపి వెంటనే మరొకరిచేత రాజీనామా చేయించి మళ్ళీ ఉపఎన్నిక తీసుకురావచ్చు. కనుక ఈ తలనొప్పులు వద్దనుకొంటే సిఎం కేసీఆర్‌ ఏకంగా ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. 

ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక వాటితో పాటు మునుగోడు ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కనుక ఒకవేళ సిఎం కేసీఆర్‌ ముందస్తుకి వెళ్ళాలనుకొంటే త్వరలోనే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 


Related Post