గవర్నర్‌ తమిళిసై బాసర పర్యటన... ప్రోటోకాల్ షరా మామూలే

August 08, 2022


img

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొన్నాక ట్రిపుల్ ఐ‌టి(ఆర్జీయూకేటీ) లో పర్యటించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. యధా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు. 

శనివారం రాత్రి 11.30 గంటలకు ఆమె రామేశ్వరం-ఓఖా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి రాత్రి 2.40 గంటలకు నిజామాబాద్‌ స్టేషన్‌కు చేరుకొన్నారు. అక్కడి నుంచి గంటన్నరసేపు కారులో ప్రయాణించి తెల్లవారుజామున 4 గంటలకు బాసరచేరుకొని, అక్కడ యూనివర్సిటీ గెస్ట్ హౌసులో విశ్రాంతి తీసుకొన్నారు. ఉదయం అమ్మవారిని దర్శించుకొన్న తర్వాత బాసర ట్రిపుల్ ఐ‌టి చేరుకొన్నారు. 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విద్యార్థుల హాస్టల్ గదులు, బాత్రూంలు, క్యాంటీన్, తరగతి గదులు అన్నీ పరిశీలించారు. ఉదయం విద్యార్థులతో కలిసి క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఆమె యూనివర్సిటీలో పర్యటిస్తున్నంత సేపు విద్యార్థులు ఆమె వెంటే ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. 

తర్వాత ఆర్జీయూకేటీ అధికారులతో మాట్లాడి ఏమేమి పనులు జరుగుతున్నాయో అడిగి తెలుసుకొన్నారు. తమిళిసై సౌందరరాజన్‌ సుమారు 6 గంటల సేపు యూనివర్సిటీలోనే ఉండి విద్యార్థులతో మాట్లాడి, వారు చెప్పుకొన్న సమస్యలన్నీ ఓపికగా విన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హామీ ఇచ్చారు.      

తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “విద్యార్థులు ఏమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. మంచి భోజనం, వసతి సౌకర్యాలు, బోధన సిబ్బంది కావాలని అడుగుతున్నారు. నేను స్వయంగా పరిశీలించి వారు చెప్పినవన్నీ నిజమేనని దృవీకరించుకొన్నాను. విద్యార్థులకు ధైర్యం చెప్పి చదువులపై దృష్టిపెట్టాలని, వారి సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి మేర ప్రయత్నిస్తానని చెప్పాను.  

అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీ అంతటా కలియతిరిగి అక్కడ కూడా ఇంచుమించు అవే సమస్యలు ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఆ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు. 

మధ్యాహ్నం యూనివర్సిటీ గెస్ట్ హౌసులో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ చేరుకొని అఖోలా-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అయ్యారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ తదితర అధికారులు స్వాగతం, వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కానీ ఎవరూ హాజరుకాలేదు. గవర్నర్‌ పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోయినా టిఆర్ఎస్‌ నేతలు నేడు ఆమెపై విమర్శలు గుప్పించడం ఖాయం.


Related Post