మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ వ్యూహం ఏమిటో?

August 06, 2022


img

తెలంగాణలో తిరుగేలేదని చెప్పుకొంటున్న టిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ మునుగోడు ఉపఎన్నికల గురించి చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మంత్రి కేటీఆర్‌ నిన్న సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో చిట్-చాట్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి మునుగోడు ఉపఎన్నిక గురించి అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా “ఇప్పటివరకు అనేక ఉపఎన్నికలు జరిగాయి. వాటిలో ఇదీ ఒకటి. కనుక దీంతో మారిపోయేది ఏమీ ఉండబోదు,” అని అన్నారు. 

వచ్చే శాసన ఎన్నికలలో టిఆర్ఎస్‌ మళ్ళీ ఘన విజయం సాధిస్తుందని గట్టిగా నొక్కి చెప్పిన కేటీఆర్‌ మునుగోడు ఉపఎన్నిక విషయంలో మాత్రం ఈవిదంగా చెప్పడం గమనిస్తే టిఆర్ఎస్‌ ముందే ఓటమికి సిద్దపడిందా లేక దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలలో చేసిన పొరపాటును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడుతోందా?అనే సందేహం కలుగుతుంది. 

ఆ రెండు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ బిజెపి చేతిలో ఓడిపోయింది. ముఖ్యంగా హుజురాబాద్‌ ఉపఎన్నికలైతే సిఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్నట్లే అనిపించాయి. కనుక ఆ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓటమి కేసీఆర్‌ ఓటమిగానే పరిగణించబడింది. 

హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించి ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేయాలనే పంతంతోనే టిఆర్ఎస్‌ ఆ ఉపఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఆ ఉపఎన్నికకి టిఆర్ఎస్‌ అంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలననే ఆ ఓటమి కూడా భూతద్ధంలో నుంచి చూసినట్లు చాలా పెద్దగా కనబడి కేసీఆర్‌ ప్రతిష్టను మసకబార్చింది.  అంతేగాదు రాష్ట్రంలో బిజెపి బలం పెరుగుతోందని స్పష్టమైన సంకేతం ప్రజలకు వెళ్లింది. 

బహుశః అందుకే ఈసారి మునుగోడు ఉపఎన్నికలు తమకు అంత ప్రాధాన్యమైనవి కావన్నట్లు టిఆర్ఎస్‌ వ్యవహరించబోతున్నట్లు కేటీఆర్‌ మాటలతో స్పష్టమవుతోంది. కానీ మునుగోడు ఉపఎన్నికలలో ఓడిపోయినా టిఆర్ఎస్‌కు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే అనే బిజెపి నేతల వాదనలకు బలం చేకూరుతుంది. 

కనుక ఈసారి మునుగోడు ఉపఎన్నికలకు తాము అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదని చెపుతూనే  గెలుపుకు గట్టి ప్రయత్నాలు చేసుకోవాలని టిఆర్ఎస్‌ ఫిక్స్ అయినట్లు భావించవచ్చు.


Related Post