మునుగోడులో సోనియా సెంటిమెంట్.. పనిచేస్తుందా?

August 06, 2022


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8వ తేదీన తన రాజీనామా లేఖను స్పీకర్ చేత ఆమోదింపజేసుకొంటానని చెప్పారు. కనుక మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అని స్పష్టం అయ్యింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే ఈ ఉపఎన్నిక కోసం సన్నాహాలు మొదలుపెట్టేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, నిన్న చండూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 

తెలంగాణ ఇచ్చిన కన్నతల్లి సోనియా గాంధీ అంటూ రేవంత్‌ రెడ్డి ప్రజలలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేశారు. మునుగోడు ప్రజలు సోనియా గాంధీ మొహం చూసి రాజగోపాల్ రెడ్డికి ఓట్లేసి ఎమ్మెల్యేని చేస్తే అతను ప్రజలను వంచించి బి‌జేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కన్న తల్లి వంటి సోనియా గాంధీకి, ఓట్లేసి గెలిపించిన ప్రజలకి వెన్నుపోటు పొడిచిన రాజగోపాల్ రెడ్డిని ఉపఎన్నికలలో ఓడించి గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అవి టిఆర్ఎస్‌-బిజెపిల మద్యనే సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలలోనూ అదే జరుగబోతోందని తెలిసి ఉన్నా రేవంత్‌ రెడ్డి ఇప్పటి నుంచే ఇంత దూకుడు ప్రదర్శిస్తుండటం ఆసక్తికరం. పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా సీనియర్లు తన నాయకత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తుండటం, వ్యతిరేకిస్తుండటంతో ఈ మునుగోడు ఉపఎన్నికలలో పార్టీని గెలిపించుకొని అందరి నోళ్ళు మూయించాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. 

అయితే ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆయన రాజీనామా చేశారు. కనుక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు ఆలోచించడం సహజం. కనుకనే రేవంత్‌ రెడ్డి సోనియా గాంధీ… కన్నతల్లి అంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. కానీ ఒకసారి టిఆర్ఎస్‌, బిజెపిలు ఎంట్రీ ఇస్తే ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా? అంటే అనుమానమే. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంతకంటే మరో దారి లేదనే చెప్పాలి. 


Related Post