మునుగోడు ఉపఎన్నికలకు బీఎస్పీ కూడా సిద్దం

August 05, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో బీఎస్పీ కూడా పోటీ చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ ప్రకటించారు. టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీలు పనికిమాలిన రాజకీయాలు చేస్తూ, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నాయని ప్రవీణ్ కుమార్‌ ఆరోపించారు. మూడు పార్టీలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది కనుక సామాజిక న్యాయం అజెండాగా మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయబోతున్నామని ప్రవీణ్ కుమార్‌ చెప్పారు. 

అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌ పార్టీకి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉండగా అది పట్టించుకోలేదు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్ళు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వ్యాపారాలు, రాజకీయాలు చేసుకొంటూ తిరిగి ఇప్పుడు నియోజకవర్గం, ప్రజల కోసం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్‌, బిజెపిలను విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కనుక మూడు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ ఉపఎన్నికలో బీఎస్పీ పోటీ చేస్తుంది. బీఎస్పీ గెలుపు సామాజిక అవసరం. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది,” అని చెప్పారు. 

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఐఏఎస్ పోలీస్ అధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం లభించడం లేదనే భావనతో గత ఏడాది తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బడుగు బలహీనవర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

హుజురాబాద్‌ ఉపఎన్నిక జరిగినప్పుడు దానికి దూరంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలలో పోటీకి సై అంటున్నారు. అంటే రాష్ట్రంలో పార్టీకి ప్రజాధారణ, బలం పెరిగిందనే నమ్మకం కలిగినట్లు భావించవచ్చు. అయితే మూడు ప్రధాన పార్టీలు అంగబలం, అర్దబలం ఉన్న అభ్యర్ధులను బరిలో దించేందుకు సిద్దం అవుతున్నాయి. మరి వారిని, వాటి వెనుక ఉండే ఈ మూడు పార్టీలను బీఎస్పీ తట్టుకొని ఎదురొడ్డి పొరాడి గెలవగలదా? చూడాలి.


Related Post