మునుగోడు ఉపఎన్నికలు... మూడు పార్టీలకు అగ్నిపరీక్షే

August 05, 2022


img

తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ హటాత్తుగా వేడి పెరిగింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్దపడుతుండటమే ఇందుకు కారణం. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్న అధికార టిఆర్ఎస్‌ ఈ ఉపఎన్నికలో బిజెపిని అడ్డుకొని విజయం సాధించకపోతే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రాభవం తగ్గుతోందని, బిజెపి బలపడుతోందనే తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళతాయి. కనుక ఎట్టి పరిస్థితులలో మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచి తీరాలి. 

తెలంగాణలో బిజెపికి ప్రజాధారణ పెరిగి చాలా బలపడింది.. వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం ఖాయం అని ప్రజలకు బలమైన సంకేతాలు పంపేందుకు మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి గెలవడం చాలా అవసరం. అందుకే రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని బిజెపి గట్టిగా పట్టుబట్టినట్లు భావించవచ్చు. 

అదీగాక నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం తనకు తిరుగేలేదని రాజగోపాల్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఈ ఉపఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవలసి ఉంటుంది. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆత్మహత్యతో సమానం. కనుక బిజెపి ఆయనకు బదులు వేరే అభ్యర్ధిని బరిలో దించినా ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ ఈ ఉపఎన్నికలో ఆయనే పోటీ చేసినా వేరే అభ్యర్ధిని నిలబెట్టినా బిజెపి గెలవక తప్పదు. 

ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయడం వలన ఈ ఖాళీ ఏర్పడి ఉపఎన్నిక జరుగబోతోంది కనుక ఈ స్థానాన్ని మళ్ళీ గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీపై పట్టు సాధించాలంటే ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని గెలిపించుకోవలసి ఉంటుంది. లేకుంటే వరుసగా మూడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయినవాడు శాసనసభ ఎన్నికలలో ఏం గెలిపించగలడు?అని సొంత పార్టీలోనే నేతలు ప్రశ్నించడం ఖాయం. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన కొన్ని గంటలలోపే మునుగోడు ఉపఎన్నికలకు శంఖారావం పూరించి నేడు చండూరులో మునుగోడు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 

కనుక మునుగోడు ఉపఎన్నికలు మూడు పార్టీలకు మరోసారి అగ్నిపరీక్షగా మారనున్నాయి.


Related Post