ఏ క్షణంలోనైనా పిడుగు పడొచ్చు: తుమ్మల

August 03, 2022


img

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు కానీ 2018 ముందస్తు ఎన్నికలలో ఓడిపోయారు. ‘తుమ్మల నాకు చాలా ఆత్మీయుడు, మంచి స్నేహితుడు’ అని చెప్పిన సిఎం కేసీఆర్‌ ఎన్నికలలో ఓడిపోగానే తుమ్మలను పూర్తిగా మరిచిపోయినట్లు వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఆ తరువాత ఖమ్మం జిల్లాకే చెందిన నామా నాగేశ్వరరావుని పార్టీలో తీసుకొని ఎంపీగా పార్లమెంటుకు పంపించినప్పటి నుంచి తుమ్మలను పార్టీలో, ప్రభుత్వంలో పట్టించుకొనేవారే లేకుండాపోయారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తిగానే ఉన్నప్పటికీ కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నారు.  కానీ జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు, అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. 

ఇప్పుడు రాష్ట్రంలో రుతుపవనాలతో పాటు ఎన్నికల వాతావరణం కూడా నెలకొని ఉన్నందున తుమ్మల కూడా మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల తన అనుచరులతో సమావేశమైన తుమ్మల “ఏ క్షణంలోనైనా పిడుగు పడొచ్చు అందరూ సిద్దంగా ఉండండి. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నుంచి పాలేరు నియోజకవర్గంలోనే మీ అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తాను,” అని చెప్పారు. 

తుమ్మల చెపుతున్న ఆ పిడుగు ముందస్తు ఎన్నికలే అని అర్దమవుతూనే ఉన్నాయి. అంటే ముందస్తు ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలని సిఎం కేసీఆర్‌ నుంచి ఆయనకు ఏమైనా సందేశం అందిందా?లేదా తుమ్మల కూడా బిజెపిలో చేరి పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.


Related Post