రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే...

August 03, 2022


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఉప ఎన్నికకు వ్యూహాత్మక, ప్రచార కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించడం విశేషం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్ పేరుతో కాంగ్రెస్‌ అధిష్టానం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ నోట్‌ను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

ఈ కమిటీ కన్వీనరుగా మధు యాష్కీ గౌడ్, సభ్యులుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బలరామ్ నాయక్,  దాసరి అనసూయ (సీతక్క), అంజన్ కుమార్‌ యాదవ్, సంపత్ కుమార్, ఆర్ అనిల్ కుమార్‌లను నియమిస్తున్నట్లు దానిలో మానిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. 


దాంతోపాటు ‘నిఖార్సైన కాంగ్రెసోడా... రాకదలిరా,’ అంటూ ఆగస్ట్ 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రావలసిందిగా ఆహ్వానిస్తూ రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల ఫోటోలతో కూడిన ఓ ఆహ్వాన పత్రికను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

“రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ వెళ్లిపోతే ప్లాన్ బీ-సిద్దం,” అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందే చెప్పారు. కనుక కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘ప్లాన్-బి’ని అమలుచేసినట్లు భావించవచ్చు. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి మళ్ళీ ఆ సీటును దక్కించుకోవాలని, తద్వారా తన సత్తా చాటుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. అందుకే గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన చేశారనుకోవచ్చు. 


Related Post