శ్మశానవాటికలపై జీఎస్టీ లేదు: నిర్మలా సీతారామన్

August 03, 2022


img

ప్రజలపై గణనీయంగా పన్నుల భారం తగ్గిస్తామని చెపుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని బలవంతంగా ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు చావు పుట్టుకల మొదలు రోజువారీ జీవితంలో జీఎస్టీ లేనిదంటూ లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికే జీఎస్టీ ఉపయోగపడుతోంది తప్ప ప్రజలకు కాదని స్పష్టమైపోయింది. దేశంలో జీఎస్టీ పరిధిలోలేనిదంటూ ఏమీ లేదంటే అతిశయోక్తి కాదు. పప్పులు, పెరుగు, మజ్జిగ, లస్సీ చివరికి శ్మశానవాటికలపై కూడా జీఎస్టీ పేరుతో దండుకొంటోంది. దీనిపై మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. 

“జీఎస్టీ విషయంలో వాస్తవాల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఆహార పదార్ధాలపై పన్ను విధిస్తున్నాయి. కనుక పప్పులు, పెరుగు, మజ్జిగ, లస్సీలపై జీఎస్టీ విధించడాన్ని తప్పు పట్టలేము. ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలపై 5 శాతం జీఎస్టీ విధించేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించిన తరువాతే అమలుచేస్తున్నాము. 

శ్మశానాలపై జీఎస్టీ విధిస్తున్నామనే వార్తలలో నిజం లేదు. కొత్తగా నిర్మిస్తున్న శ్మశానాలపై మాత్రమే జీఎస్టీ విధిస్తున్నాము. ఇక ఆసుపత్రులలో రూములు, ఐసీయు బెడ్లపై ఎటువంటి జీఎస్టీ విధించలేదు. రోజుకి రూ.5.000 పైన ఛార్జ్ చేసే బెడ్‌లు, రూమ్‌లపై మాత్రమే జీఎస్టీని విధిస్తున్నాము. అలాగే బ్యాంక్ చెక్కుబుక్కులపై జీఎస్టీ విధిస్తున్నామనే వార్తలలో నిజం లేదు. ప్రింటర్ నుంచి బ్యాంకులు చెక్కు బుక్కులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది,” అంటూ వివరించారు. 

అయితే నిర్మలా సీతారామన్ ముక్కు ఏదంటే చుట్టూ తిప్పి చూపినట్లే మాట్లాడారని అర్దమవుతోంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో నగరాలు, పట్టణాలలో కొత్తగా వైకుంఠధామం లేదా మరో పేరుతో శ్మశానాలు నిర్మిస్తున్నాయి. కనుక మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళ్లినప్పుడు జీఎస్టీ బాదుడు తప్పదని స్పష్టం అవుతోంది. పాలు, పెరుగు, పప్పులు, ఉప్పు, నూనెలు అన్నీ చాలా కాలంగా ప్యాక్ చేసి మాత్రమే అమ్ముతున్నారు. కనుక ప్రజలు వాటికీ జీఎస్టీ చెల్లించక తప్పదు. 

ఆసుపత్రులలో దోపిడీ ఏవిదంగా ఉంటుందో అందరికీ తెలుసు. కనుక బెడ్లు, రూములు, ఐసీయులపై జీఎస్టీ లేదని నిర్మలా సీతారామన్ చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. జీఎస్టీ అనేది సామాన్య ప్రజలకు అర్దం కానీ ఓ బ్రహ్మ పదార్ధంలా మార్చేసి నిలువునా దోచుకొంటున్న సంగతి అందరికీ తెలుసు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు వారి భుజాలపైనే ఎక్కి కూర్చొని ఈవిదంగా జీఎస్టీ కొరడాతో బాదుతున్నా ఏమీ చేయలేని నిసహాయస్థితిలో ప్రజలున్నారని చెప్పక తప్పదు. 


Related Post