అల్‌ ఖైదా చీఫ్ అల్-జవహరీ ఖేల్ ఖతం.. తాలిబన్ల మాటేమిటి?

August 02, 2022


img

అమెరికాలో 9/11 ఘటనలో సుమారు మూడు వేలమంది మరణానికి కారకుడైన అల్‌ ఖైదా చీఫ్ అల్-జవహరీని అమెరికా దళాలు సోమవారం సాయంత్రం అతని నివాసంలోనే మట్టుబెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో అతను తన ఇంటిపై ఉన్నపుడు డ్రోన్ ద్వారా క్షిపణులతో దాడి చేసి హతమార్చారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా దృవీకరించారు. 

“అమెరికన్లకు హాని చేస్తే ప్రపంచంలో ఏ మూల దాక్కొన్నా మట్టుబెడతాము. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 3,000 మంది కుటుంబాలు ఇంతకాలంగా అనుభవిస్తున్న బాధ, ఆవేదనకు జవహరీ చావుతో న్యాయం జరిగిందని భావిస్తున్నాను,” అని అన్నారు.      

అల్‌ ఖైదా చీఫ్ బిన్ లాడెన్‌ తరువాత రెండో స్థానంలో ఉండే అల్-జవహరీ 9/11 కుట్రలో చాలా కీలకపాత్ర పోషించాడు. అమెరికా దళాలు బిన్ లాడెన్‌ను హతమార్చిన తరువాత అల్‌ ఖైదా చీఫ్‌గా బాధ్యత చేపట్టాడు. అతను కాబూల్ నగరంలో ఉన్నట్లు అమెరికా నిఘావర్గాలు పసిగట్టినప్పటి నుంచి అతనిపై నిఘా ఉంచి అతని కదలికలను గమనిస్తున్నాయి. అతనిని హతమార్చేందుకు జో బైడెన్ జూలై 25న ఆమోదం తెలుపడంతో ఆఫ్ఘనిస్తాన్ కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం అతను తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఉండగా డ్రోన్ ద్వారా రెండు హెల్-ఫైర్ క్షిపణులతో అతనిపై దాడి చేసి హతమార్చాయి. ఈ దాడిలో అదే భవనంలో ఉన్న తానై కుటుంబ సభ్యులకు ఎటువంటి హానీ కలగలేదని అమెరికా ప్రకటించింది. 

 అల్‌ ఖైదా చీఫ్ అల్-జవహరీని అమెరికా దళాలు హతమార్చడం అభినందనీయమే. అయితే అమెరికన్లకు హానే చేస్తే ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల నక్కినా హతమారుస్తామని చెప్పిన జో బైడెన్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని తాలిబాన్ ఉగ్రవాదులకు అప్పగించేసిన సంగతి అప్పుడే మరిచిపోయినట్లున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గత ఏడాది ఆగస్ట్ నెలాఖరున అమెరికా భద్రతాదళాలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోగానే తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకొన్నారు. అప్పటి నుంచి తాలిబన్ల పాలనలో అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ అమెరికా దృష్టిలో వారి కష్టాలు, కన్నీళ్ళకు, వారి ప్రాణాలకు విలువ లేదని సరిపెట్టుకోవాలేమో? 



Related Post