కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గోల ఏమిటో?

July 30, 2022


img

బిజెపిలో చేరేందుకు మూటాముల్లె సర్దుకొని కూర్చొన్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చెపుతున్న మాటలు ముక్కు ఏదంటే చుట్టూ తిప్పి చూపిస్తునట్లున్నాయి. 

ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను కోరుకొంటేనో లేదా కేసీఆర్‌ కోరుకొంటేనో ఉపఎన్నికలు రావు. మునుగోడు ప్రజలు కోరుకొంటేనే వస్తాయి. మునుగోడు పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నందుకు నేను కేసీఆర్‌తో ధర్మయుద్ధం చేయడానికి సిద్దంగా ఉన్నాను. మరి మునుగోడు ప్రజలు కూడా సిద్దమేనా?ఇది పార్టీలకు మద్య జరుగబోయే యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలకు మద్య జరుగబోతున్న యుద్ధం. మునుగోడు యుద్ధం తెలంగాణ రాజకీయాలలో పెనుమార్పు వస్తుంది. మరో 15 రోజులలో యుద్ధ ప్రకటన చేస్తాను,” అని చెప్పారు. 

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఇంకా కీలకపదవి కావాలని ఆశించి భంగపడ్డారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని బిజెపి వస్తుందని ఆయనే చెపుతున్నారు. ఈ కారణాల వలననే ఆయన బిజెపిలో చేరి తన రాజకీయ భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చుకోవాలనుకొంటున్నారని అర్దమవుతూనే ఉంది. బిజెపిలో చేరే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోంది. బిజెపి కోరుతోంది కనుకనే రాజీనామాకు సిద్దపడుతున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుంది. 

కనుక తన రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారుతూ, బిజెపి ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తూ దానికి రాజగోపాల్ రెడ్డి ఇంత బిల్డప్ ఇస్తున్నారు. తన రాజీనామాతో తెలంగాణలో ఏదో జరిగిపోబోతోందన్నట్లు చెపుతున్నారు. గతంలో సిఎం కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్‌ రాజీనామా చేసి ఉపఎన్నికలో గెలిచిన తరువాత ఏమి జరిగింది?ఏమీ జరుగలేదు. రాష్ట్రంలో బిజెపి మరికాస్త బలపడిందని ప్రజలు గ్రహించారు అంతే! ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచినా, ఓడినా జరిగేది అదే! 

కాంగ్రెస్ పార్టీ ఆయనకు అతిగా ప్రాధాన్యం ఇస్తున్నందున తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకొంటున్నారు. అయితే ఆయన బిజెపిలో చేరితే కాంగ్రెస్‌కు కాస్త ఎదురుదెబ్బ తగులుతుంది. ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలు తమ బలప్రదర్శన చేసుకొని సత్తా చాటుకొనే అవకాశం లభిస్తుంది అంతే.


Related Post