రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ప్రజలు వర్షాలు, వరదలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో సిఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి జాతీయరాజకీయాల గురించి విపక్ష నేతలతో చర్చలు జరుపుతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో సిఎం కేసీఆర్ నివాసానికి వచ్చి కలిశారు. వారిరువురూ జాతీయ రాజకీయాలపై సుమారు గంటసేపు చర్చించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో సాగుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఏవిదంగా ఎదుర్కొని గద్దె దించాలనే అనే అంశంపై వారిరువురూ చర్చించారు. సిఎం కేసీఆర్ చొరవ తీసుకొని దీనికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అఖిలేష్ యాదవ్ కోరారు.
వరదల కారణంగా ప్రాధమిక అంచనా ప్రకారం రాష్ట్రానికి సుమారు రూ.1,400 కోట్లు నష్టం జరిగిందని ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసి సాయం కోరింది. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌లను కలిసి పరిస్థితి వివరించి వరదసాయం కోరవచ్చు కదా? కానీ అది కూడా చేయకుండా సిఎం కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి అప్పులు సాదించుకోవడం, జాతీయరాజకీయాల గురించి చర్చిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.