గ్యాంగ్ రేప్ చేసినవారిని మేజర్లుగా పరిగణించాలి

July 29, 2022


img

జూబ్లీహిల్స్‌ మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు మైనర్ బాలురను మేజర్లుగా పరిగణించి విచారణ జరపాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా ఛార్జ్-షీట్లు దాఖలు చేశారు. 

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఐదుగురు మైనర్ బాలురు వయసు పరంగా మైనర్లు కావచ్చు కానీ   తాము చేస్తున్నది చాలా హేయమైన నేరమని తెలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని హేయమైన నేరానికి పాల్పడినందుకు వారిని మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయస్థానాలను కోరారు. ఈ సందర్భంగా పోలీసులు 350 పేజీలు కలిగిన నివేదికలను న్యాయస్థానాలకు అందజేశారు. వాటిలో మైనర్ బాలురు ఏవిదంగా ఈ నేరాన్ని చేశారో రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ పొందుపరిచారు. ఆ నివేదికల ఆధారంగా వారిని మేజర్లుగా పరిగణించి విచారణ చేపట్టి, చట్ట ప్రకారం కటినంగా శిక్షించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయస్థానాలను అభ్యర్ధించారు.

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు క్రైమ్ సీన్ రిక్రియేషన్ పేరుతో భూటకపు ఎన్‌కౌంటర్ చేశారని జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్ తేల్చి చెప్పింది. తాము నిరుపేదలం, బడుగు బలహీనవర్గాలవారం కనుకనే పోలీసులు తమ పిల్లలను తీసుకువెళ్ళి ఎన్‌కౌంటర్ చేశారని వారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటి నేరమే చేసిన నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసి విడుదల చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక నేరాన్ని బట్టి న్యాయం కాకుండా డబ్బు, పలుకుబడి, హోదాను బట్టి న్యాయం ఉంటుందనే భావన కలుగుతోంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కోరినట్లుగా ఈ నేరానికి పాల్పడినవారిని మేజర్లుగా పరిగణించి విచారణ జరిపి దోషులకు కటినశిక్షలు విధించి న్యాయస్థానాలపై ప్రజల నమ్మకం పెరిగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Related Post