తుమ్మితే ఊడిపోయే ముక్కు... రాజగోపాల్ రెడ్డి

July 28, 2022


img

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక సంక్షోభంలో నుంచి మరో సంక్షోభంలో ప్రయాణిస్తూనే ఉంటుందని ఓ జోక్ ఉంది. అది నిజమని నిరూపిస్తూ అక్కడ ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కధ రసవత్తరంగా సాగుతోంది. ఆయన బిజెపిలో చేరేందుకు సిద్దపడటంతో చేజారిపోకుండా కాపాడుకోవాలని కాంగ్రెస్‌ నేతలు, ఎలాగైనా బిజెపిలోకి రప్పించుకోవాలని బండి సంజయ్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

బండి సంజయ్‌ రేపు (శుక్రవారం) రాజగోపాల్ రెడ్డిని వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి కాషాయకండువా కప్పాలని అనుకొన్నారు. అయితే పార్టీలో చేరగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని బిజెపి పట్టుబడుతుండటంతో రాజగోపాల్ రెడ్డి డైలమాలో పడ్డారు. తనకు ఆలోచించుకోవడానికి వారం రోజులు సమయం కావాలని కోరారు. 

ఈ గ్యాప్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను బుజ్జగించి పార్టీ వీడకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. భట్టి విక్రమార్క రాయబారం విఫలమవడంతో ఇప్పుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆయనతో రాయబారం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ కూడా ఫోన్‌ చేసి, ఓ సారి ఢిల్లీ వస్తే సమస్యలేమైనా ఉంటే మాట్లాడుకోవచ్చునని చెప్పినట్లు తెలుస్తోంది. 

మరోపక్క టిఆర్ఎస్‌ కూడా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌లో కాస్త మసాలా కలిపే ప్రయత్నం చేస్తోంది. ఆయనను బిజెపిలో చేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఝార్ఖండ్‌లో ఓ భారీ బొగ్గు గనిని 20-30 ఏళ్ళ లీజుకు ఇస్తానని ఆఫర్ చేసిందని టిఆర్ఎస్‌ కొత్త విషయం చెపుతోంది. అయితే ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా, బిజెపిలో చేరినా ఆయనకు మునుగోడు ఎమ్మెల్యేగా ఇదే ఆఖరిసారి అని టిఆర్ఎస్‌ గట్టిగా చెపుతోంది. 

ఇక అసలు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి రెండేళ్ళ నుంచి బిజెపిలో చేరాలనే తాపత్రయపడుతున్నారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏదోవిదంగా బుజ్జగించి పార్టీలో నిలుపుకొన్నప్పటికీ తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి ఆయనను చిరకాలం కాపాడుకోవడం కష్టమే కనుక అటువంటి వ్యక్తి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇంతగా ఆరాటపడటం అనవసరమే.


Related Post