ఢిల్లీలో మకాం వేసి ఏం చేస్తున్నారు? రేవంత్ ప్రశ్న

July 28, 2022


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఏం చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ హైదరాబాద్‌ నగరంలో వరదలతో అల్లకల్లోల్లంగా మారితే సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో కూర్చొని అప్పుల లెక్కలు చూసుకొంటున్నారని విమర్శించారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసినప్పటికీ ఇంతవరకు ప్రధాని నరేంద్రమోడీని కలిసి వరద సాయం కోరలేదని రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌ను ఆక్షేపించారు. భారీ వర్షాలు, వరదల వలన రాష్ట్రానికి సుమారు రూ.1400 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినప్పుడు సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని కలిసి వరద సాయం చేయమని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. 

సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతానని శపధాలు చేసినందున ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఆయన దాని గురించి అడుగుతారనే భయంతోనే వెళ్ళి కలవడం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఒకవేళ సిఎం కేసీఆర్‌కు ఒంటరిగా వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ కలిసే ధైర్యం లేకపోతే అఖిలపక్షాన్ని ఆహ్వానిస్తే అందరం కలిసి నిలదీద్దామని సూచించారు. 

ఒకవేళ రాష్ట్రానికి వరద సాయం సాధించలేకపోతే వెంటనే హైదరాబాద్‌ తిరిగి వచ్చి పాలన వ్యవహారాలనైనా చక్కబెట్టాలని రేవంత్‌ రెడ్డి హితవు పలికారు.     

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. “ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకపోయి ఉండవచ్చు. కానీ మీరు ప్రధాని అయ్యేందుకు తెలంగాణ ప్రజలు కూడా ఓట్లు వేసి నలుగురు ఎంపీలను ఇచ్చారు. కనుక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత మీపై ఉంది. మీరు గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని కాదు యావత్ దేశానికి ప్రధాని అనే విషయం మరిచిపోవద్దు. కనుక తెలంగాణకు తక్షణం వరద సాయంగా రూ.1400 కోట్లు అందించాలి,” అని అన్నారు. 


Related Post