అల్లూరి పాత్ర ఎందరో చేశారు.. కానీ దేశభక్తి రగిలించింది ఒక్కరే!

July 28, 2022


img

ఒక్కోసారి ప్రముఖుల వాస్తవ జీవితాల కంటే వారి జీవిత కధలు ఆధారంగా తీసే సినిమాలకు అత్యంత ప్రజాధారణ లభిస్తుంది. ఆ కోవకు చెందిన చిత్రాలలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు, సావిత్రి జీవిత కధ ఆధారంగా కీర్తి సురేష్ నటించిన మహానటి, తాజాగా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకధ ఆధారంగా వచ్చిన రాకెట్రీలను చెప్పుకోవచ్చు. 

తెలుగు ప్రజలను ఉర్రూతలూపిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఆ సినిమాను చేయాలని నందమూరి తారకరారావు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆయన కంటే ముందు కృష్ణ చేయడంతో తీవ్ర నిరాశ చెందారు. అయినప్పటికీ పరుచూరి సోదరులను పిలిచి కధను సిద్దం చేయమని కోరినప్పుడు వారు ముందు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను ఓ సారి చూడమని చెప్పారు. అది చూసిన తరువాత కూడా ఇంకా ఆ కధతో సినిమా తీయాలనుకొంటే తప్పకుండా కధ సిద్దం చేస్తామని చెప్పారు. 

అప్పుడు ఎన్టీఆర్ వెంటనే ఆ సినిమా ప్రత్యేక షో వేయించుకొని చూసి, ఇక జీవితంలో అల్లూరి సీతారామరాజు కధతో సినిమా తీయనని ప్రకటించారు. సాటి నటుడు కృష్ణ అంత అద్భుతంగా ఆ సినిమాను తీసిన తరువాత తాను అంతకంటే గొప్పగా తీయలేనని, తీసినా మెప్పించలేనని ఎన్టీఆర్ భావించడమే అందుకు కారణం. 

అయితే జీవితంలో ఒక్కసారైనా అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాలనే తపించిపోయిన ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ చిత్రాలలో ఆ ముచ్చటతీర్చుకొన్నారు. ఆ తరువాత ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ భారతంలో బాలచంద్రుడు సినిమాలో ఆ పాత్రలో కనిపించి బాలకృష్ణ కూడా ఆ ముచ్చట తీర్చుకొన్నారు తప్ప అల్లూరి సీతారామరాజు కధతో సినిమా చేసే సాహసం చేయలేదు. 

అటువంటి అల్లూరి సీతారామరాజు పాత్రతో దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్‌ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజుతో రాజమౌళి చేసిన ఈ ప్రయోగం పట్ల బాధపడినవారు కోకొల్లలు ఉన్నారు. ఆ కధను చాలా లౌక్యంగా అల్లుకొని చాలా గొప్పగా చూపిన్నప్పటికీ, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పనిచేయడం, అల్లూరి పాత్ర చేసిన రామ్ చరణ్‌, కుమురం భీమ్ పాత్ర చేసిన జూ.ఎన్టీఆర్‌ కలిసి నాటునాటు అంటూ నాటుగా డ్యాన్సులు చేయడం, వారిద్దరూ ఫైట్లు చేయడం చూసి ఎందరి హృదయాలు ముక్కలయ్యాయో... ఎందరు  కన్నీళ్ళు పెట్టుకొన్నారో ఎవరికీ తెలీదు. 

రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్‌ సుమారు రూ.1,200 కోట్లు కలెక్షన్లు రాబట్టిన మాట వాస్తవం. సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా ప్రజలలో దేశభక్తిని రగిలించి హృదయాలలో ఆర్ద్రత నింపగా, ఆర్ఆర్ఆర్‌ కేవలం రంజింపజేసింది. చివరికి అది ఓ గే లవ్ స్టోరీ అనే ముద్ర కూడా పడింది.  

ఆర్ఆర్ఆర్‌ థియేటర్లలో గట్టిగా మూడు నాలుగు నెలలు నిలబడలేకపోయింది. అదే సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు 19 థియేటర్లలో 100 రోజులు ఆడింది. 50 రోజులకు పైగా ఆడిన థియేటర్లకు లెక్కేలేదు. ఓటీటీలో వచ్చిన ఆర్ఆర్ఆర్‌ను అందరూ చూసేశారు. మరోసారి చూసే ఓపిక ఎవరికీ లేదనే చెప్పవచ్చు. 

కానీ 1974, మే 1వ తేదీన విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నేటికీ ఓటీటీలో తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎప్పటికీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే తెలుగు ప్రజల హృదయాలలో అల్లూరి సీతారామరాజు చిత్రమే శాస్వితంగా నిలిచిపోతుంది. 

ఎన్టీఆర్ వంటి మహానటుడు అటువంటి గొప్ప చిత్రాన్ని చూసి వెనక్కు తగ్గారు. రాజమౌళి ఆ మహనీయుడి సినిమాను వ్యాపార దృక్పదంతో చూసి తీసి పేరు ప్రతిష్టలు, కోట్లు సంపాదించి ఉండవచ్చు కానీ ఎప్పటికీ అల్లూరి సీతారామరాజు సినిమా స్థాయిని అందుకోలేరనే చెప్పవచ్చు. 


Related Post