సమాజంలో అట్టడుగున ఉండిపోయిన దళితులను పైకి తీసుకువచ్చేందుకే దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టామని, దేశంలో మరే ప్రభుత్వమూ ఇటువంటి ఆలోచన కూడా చేయలేకపోయిందని సిఎం కేసీఆర్ స్వయంగా చెప్పుకొంటారు. కానీ జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ పదకం గురించి చెప్పిన మాటలు వింటే దానిని కేసీఆర్ ఎందుకు, ఏవిదంగా అమలుచేస్తున్నారో అర్దమవుతుంది.
బుదవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న రాంసాగర్ సర్పంచ్ రవీందర్ తమ గ్రామంలో ఇంతవరకు ఎవరికీ దళిత బంధు పధకం ఇవ్వలేదని, కనుక ఇప్పించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కోరారు.
ఎమ్మెల్యే స్పందిస్తూ, “అర్హులెవరైనా ఉంటే ఒకటో రెండో దరఖాస్తులు పంపించు... పెడదాం. అర్హులంటే తెలుసు కదా? తెలంగాణ సోయున్నోళ్ళు...అంటే కేసీఆర్‌కే తప్పకుండా ఓట్లేసేటోళ్ళు... తెలంగాణ (టిఆర్ఎస్)ను గెలిపించేటోళ్ళు. ఆ సోయున్నోళ్ళు ఉంటే పెట్టు లేకుంటే దరఖాస్తులు పంపకు. ఇందులో దాపరికం ఏం లేదు అంతా ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే కేసీఆర్ అందరికీ నీళ్ళిస్తున్నారు..కరెంటు ఇస్తున్నారు. అంతకు ముందు నీళ్ళు, కరెంటు ఉండేవి కావు కదా?ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కేసీఆర్ సర్కారు పైసలిస్తోంది. గర్భిణి స్త్రీలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రసవాలు చేయిస్తోంది. వాళ్ళు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చేతిలో పైసలు పెట్టి పంపుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు కేసీఆర్‌కే మళ్ళీ ఓట్లేసి గెలిపించాలి కదా?అటువంటి వాళ్ళకే దళిత బంధు పధకం ఇస్తాం. దాపరికం ఏం లేదు,” అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.
దీనిని బట్టి ఈ నిబందన ఒక్క దళిత బంధు పధకానికే కాదని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఒంటరి మహిళ పింఛను, వృద్ధాప్య పించన్లు, తెల్ల రేషన్ కార్డులు వగైరాలన్నీ టిఆర్ఎస్‌కు ఓట్లు వేసేవారికే అని అర్దమవుతోంది. దీనినే మరోవిదంగా చెప్పుకోవాలంటే ఓట్ల కోసమే సంక్షేమ పధకాలు. అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇదే విదంగా వ్యవహరిస్తున్నాయి. కాకపోతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వంటివారు నోరుజారి బయటపెట్టుకొంటారు మిగిలినవారు వేరేలా చెప్పుకొని లబ్దిపొందుతుంటారు. అంతే!